హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ‘మీరు నన్ను ఆహ్వానించారు, కానీ నేను రాలేను’ అని ఎవరైనా చెప్పగానే.. ‘మీరు ఆ మాత్రం మాట్లాడటమే మహద్భాగ్యం’ అని అవతలి వ్యక్తి భజన చేస్తే ఎలా అనిపిస్తుంది. ఆస్కార్ రేంజ్లో నటిస్తున్నాడని సులభంగా అర్థం అవుతుంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేష్టలు అచ్చం ఇలానే ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సోనియమ్మ కనికరించిందీ లేదు.. రాహుల్ భేష్ అన్నదీ లేదూ.. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం అనవసర పొగడ్తలతో పరువు తీసుకున్నారని, రాష్ట్రం పరువు కూడా తీశారని మండిపడుతున్నారు. కులగణనపై గురువారం ఢిల్లీలో నిర్వహించిన సభకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరు కాలేదు. ‘కుల గణన సర్వే వివరాల ప్రదర్శనకు నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. ముందస్తు పనుల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను’ అని సోనియాగాంధీ రేవంత్‌రెడ్డికి లేఖ పంపారు. అంతే.. దీనిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని రేవంత్‌రెడ్డి వీర లెవల్లో నాటకం ఆడారు.
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఇతర అధిష్ఠాన పెద్దలు, ముఖ్యనేతల ముందు సోనియా గాంధీని అతిగా పొగిడేశారు. ఆ లేఖను చూపెడుతూ ‘అమ్మ మాటే నాకు శాసనం’ అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చేశారు. ‘ఈ లేఖ నాకు నోబెల్, ఆస్కార్, లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో సమానం. నేను భవిష్యత్తులో ఎక్కడ, ఏ స్థానంలో ఉన్నా అన్నింటికన్నా సోనియాగాంధీ రాసిన ఈ లేఖే గొప్పది’ అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి చేసిన ఈ భజనకు అక్కడున్న ప్రతినిధులు సైతం షాక్ అయ్యారు. ‘కార్యక్రమానికి రాలేను’ అని రెండు ముక్కలు రాస్తే, దానికి ఇన్ని ఉపమానాలు, ఉపమేయాలు కలిపి ఎందుకు బిల్డప్ ఇస్తున్నట్టు? అని చర్చించుకున్నట్టు సమాచారం. తప్పని పరిస్థితుల్లో సభికులంతా చప్పట్లు కొట్టడంతో మరో అడుగు ముందుకేసి ఆ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సోనియా గాంధీ రాసిన లేఖను సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత వైరల్‌గా మారింది. వాస్తవానికి ఆ లేఖలో నేరుగా రేవంత్‌రెడ్డిని పొగిడినట్టుగానీ, ఆయన పాలనను ప్రశంసిస్తూగానీ ఒక్క మాట కూడా లేదు. అయినా ఆ లేఖను పట్టుకొని ఎందుకు అంత రెచ్చిపోయారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. ఈ మాత్రం దానికే ఆస్కార్, భాస్కర్ రేంజ్ బిల్డప్‌లు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ దాదాపు ఏడాదికాలంగా పట్టించుకోవడం లేదని, ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కులగణన సర్వే సదస్సు రూపంలో ఆ ఇద్దరిని ఒకేసారి కలిసే అవకాశం కలుగుతుందని, ఒక రేంజ్లో పొగిడి ప్రసన్నం చేసుకోవాలని రేవంత్‌రెడ్డి భావించినట్టు చెప్పుకుంటున్నారు. తీరా సోనియా గాంధీ రాను అని చెప్పినా, రేవంత్‌రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందే సిద్ధం చేసుకున్న పొగడ్తల స్క్రిప్ట్‌ను అన్వయించి చదివేశారని పార్టీ నేతలే ఎద్దేవా చేస్తున్నారు.