హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): మంత్రుల మధ్య వరుసగా జరుగుతున్న వివాదాలపై రాష్ట్ర మంత్రివర్గ (Cabinet Meeting) సమావేశంలో హాట్‌హాట్‌గా చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ భేటీలో మంత్రులు ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపుతూ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నట్టు తెలిసింది. సుమారు రెండు గంటలపాటు మంత్రుల మధ్య తీవ్రమైన చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమైన క్యాబినెట్ సమావేశం రాత్రి 8 గంటలకు ముగిసింది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తోపాటు అధికారులంతా క్యాబినెట్ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రమే రాత్రి 10 గంటల దాకా క్యాబినెట్ హాల్లోనే ఉండిపోయారు.
ఈ సందర్భంగా మంత్రుల మధ్య వరుస వివాదాలు, రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్సెస్ కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వర్సెస అడ్లూరి లక్ష్మణ్, అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ వివేక్ మధ్య చెలరేగిన వివాదం రచ్చరచ్చ అయిన విషయం తెలిసిందే. వీటికితోడు తాజాగా ఎక్సైజ్ శాఖలో నెలకొన్న వివాదం పార్టీలో, ప్రభుత్వంలో తీవ్ర చర్చకు దారితీసినట్టు తెలిసింది. నిజాయితీపరుడుగా పేరున్న ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోవడం, ఇందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు వైఖరి కారణమనే ఆరోపణలతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయంలో ప్రభుత్వం బద్నాం అయిందనే అభిప్రాయాలున్నాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలిసింది.
ఇందుకు క్యాబినెట్ సమావేశాన్ని వేదికగా చేసుకున్నట్టు తెలిసింది. ‘మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కడం ఏమిటి? మన గుట్టు మనమే రట్టు చేసుకుంటే ఎలా? ఈవిధంగా మంత్రులు రచ్చకెక్కితే నష్టపోయేది ఏ ఒక్కరో కాదు.. అందరం నష్టపోతాం’ అని అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఏదైనాఉంటే తన దృష్టికి తీసుకొనిరావాలని, మీడియాకు ఎక్కొద్దని సూచించినట్టు సమాచారం. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి మాటలతో పలువురు బీసీ మంత్రులు విభేదించినట్టు తెలిసింది. మీరు చెప్తున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయని, తమకు కనీస గౌరవం దక్కడంలేదని అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఏపని చేయాలన్నా పైస్థాయి నుంచి అడ్డంకులు కల్పిస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన సీఎం.. ఇకపై అలా జరగదని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకొనిరావాలని, నేరుగా తనను కలిసి చెప్పాలని సూచించినట్టు తెలిసింది. ఒకవేళ, తనతో ఏమైనా ఇబ్బంది ఉంటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లాలని కూడా చెప్పినట్టు తెలిసింది.
రవాణా చెక్ పోస్టుల ఎత్తివేతపై ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎంను గట్టిగానే ప్రశ్నించినట్టు తెలిసింది. తొలుత చెక్‌పోస్టులను ఎత్తివేయాలని ప్రతిపాదించిందే తానని, అలాంటిది తన నోటీసులో లేకుండానే వాటిపై ఏసీబీ దాడులు చేయడం, మూసివేయడం ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. అంటే తన శాఖపై తనకు పట్టులేదనే సంకేతాలు పంపించాలనే ఆలోచన చేస్తున్నారా? అని నిలదీసినట్టు తెలిసింది.
మంత్రుల మధ్య సాగిన సుదీర్ఘ భేటీలో ఎక్సైజ్ శాఖ, రిజ్వీ ఎపిసోడ్‌పైనే ప్రధానంగా చర్చించుకున్నట్టు తెలిసింది. ఈ అంశం ప్రభుత్వానికి పూడ్చుకోలేని నష్టంచేసినట్టు పలువురు మంత్రులు అభిప్రాయపడినట్టు తెలిసింది. నిజాయితీ అధికారిగా పేరున్న రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోవడం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిందని అన్నట్టు తెలిసింది. పలువురు బీసీ మంత్రులు ఈ వ్యవహారంపై కొంత ఘాటుగానే వ్యాఖ్యానించినట్టు సమాచారం. అధికారులపై ఈవిధంగా ఒత్తిడి చేసి పని చేయించుకోవడం సరికాదని, తద్వారా ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని అన్నట్టు తెలిసింది.
బీసీ మంత్రుల శాఖల్లో అధికారులను బుజ్జగించి పనులు చేయించుకుంటుంటే.. ఓసీ మంత్రులు మాత్రం ఒత్తిడి పెట్టి పని చేసుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం పున:సమీక్షించుకోవాలని సూచించినట్టు తెలిసింది. ఇందుకు రిజ్వీ వ్యవహారాన్ని ఉదాహరణగా చెప్పినట్టు సమాచారం. రిజ్వీపై మంత్రి లెటర్ రాయడం ఏంటి? ఆయన రాసిన లెటర్‌ను బహిర్గతం చేయడమేంటి? అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఒకరో ఇద్దరో నిజాయితీపరులైన అధికారులుంటే వారిపై కూడా ఇలా ఒత్తిడి చేస్తే అది పార్టీకీ, ప్రభుత్వానికి తీరని నష్టం చేస్తుందని పలువురు బీసీ మంత్రులు స్పష్టంచేసినట్టు తెలిసింది.