CM Revanth Reddy | రంగారెడ్డి/హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): న్యూయార్క్‌ను మించి అధునాతన హంగులతో ‘బేగరికంచ’ను ఫోర్త్ సిటీగా ప్రభుత్వం అభివృద్ధి చేయబోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లు ఉండగా మరో కొత్త నగరాన్ని నిర్మించబోతున్నట్టు తెలిపారు. బంజారాహిల్స్ మాదిరిగా ఈ ప్రాంత ప్రజలు గొప్పగా చెప్పుకునేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’కి ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మరో ఇద్దరు మంత్రులతో కలిసి రేవంత్‌రెడ్డి భూమిపూజ చేశారు. దీంతోపాటు అక్కడే ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మాడ్రన్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న గొప్ప ఆశయంతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. 57 ఎకరాల్లో రూ.156 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఫోర్త్ సిటీగా మరో నగరాన్ని నిర్మించబోతున్నామని, విదేశాల నుంచి రూ.వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి హెల్త్, స్పోర్ట్స్, ఇతర కంపెనీలకు హబ్‌గా మారుస్తామని తెలిపారు. ఈ యూనివర్సిటీ ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందిస్తామన్నారు. శిక్షణతో పాటు ఉద్యోగాన్ని ఇచ్చేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని, స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందంటే ఉద్యోగం గ్యారెంటీ అని పేర్కొన్నారు.
భూములు కోల్పోతున్న రైతులు ఆధైర్యపడొద్దు
ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులు ఆధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బాధిత రైతు కుటుంబాల్లో ఆడపిల్లలు ఉంటే వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బేగరికంచకు మెట్రోను అందుబాటులోకి తీసుకువస్తామని, ఈ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 200 అడుగుల రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో రీజినల్ రింగ్‌రోడ్డును ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కే లక్ష్మారెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలజగ్గారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రపంచ అవసరాల కోసం యువతను సన్నద్ధం చేస్తాం
ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా యువతలో వృత్తి నైపుణ్యాలను వృద్ధి చేసేందుకే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా మహాత్మాగాంధీ నిర్వహించిన ‘యంగ్ ఇండియా’ పత్రిక స్ఫూర్తిగా ఈ యూనివర్సిటీకి ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ’గా నామకరణం చేసినట్టు చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై గురువారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
పీపీపీ విధానంలో..
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్వహించే ఈ యూనివర్సిటీ కోసం ఇప్పటికే డాక్టర్ రెడ్డీస్, ఓనైన్ సొల్యూషన్స్ (ఈకామర్స్ అండ్ లాజిస్టిక్స్‌కు సంబంధించి), అదానీ లాజిస్టిక్స్ తోపాటు బీఎఫ్ఎస్ఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫిజిక్స్ వాలా ముందుకు వచ్చినట్టు సీఎం తెలిపారు. న్యాక్‌కు సంబంధించి స్కూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్, రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ వీఎస్ఎస్ గేమింగ్ అండ్ యానిమేషన్ అసోసియేషన్ కూడా కోర్సులు అందించేందుకు ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు.
ఏడాదికి రూ. 50 వేలు
స్కిల్ యూనివర్సిటీలో ఏడాదికి రూ. 50 వేల నామమాత్రపు ఫీజుతో శిక్షణ ఇస్తామని సీఎం తెలిపారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉచితంగా విద్యను అందిస్తామని, వారికి హాస్టల్ వసతి కూడా కల్పిస్తామని తెలిపారు. దీనికి అనుబంధంగా అన్ని జిల్లాల్లోనూ కళాశాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు.
అక్కలను అడ్డం పెట్టుకొని రాజకీయం
సీతక్కపై అవమానకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియో పెట్టారని, దానిని ప్రదర్శిస్తే సభ గౌరవం తగ్గుతుందనే చూపించడం లేదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సభలో మంత్రి సీతక్క మాట్లాడుతుండగా, వెనక నుంచి వచ్చిన సభ్యుడు మరొక సభ్యుడితో మాట్లాడుతుండగా, దానిపై బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే(స్పీకర్) ఆ వేదికపైనుంచి వచ్చి వారిని చెప్పుతో కొడతారని చెప్పారు. ఒక ఆదివాసీ బిడ్డపట్ల ఇదేనా మీ నీతి, మీ జాతి అని పేర్కొన్నారు. ఆదివాసీ మహిళ కాబట్టి ఆమెను అవమానించవచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను అక్కలకు చెప్పదలుచుకున్నా.. మీరు ఎవరి ఉచ్చులోపడి తప్పుదారి పడుతున్నరో వారి సొంత చెల్లెలు తీహార్ జైలులో ఉంది. ఆమె అక్కడ ఉంటే వీరు ఢిల్లీ వెళ్లి తమను లోపల వేయవద్దని, కావాలంటే తమ చెల్లెల్ని మరో ఏడాది లోపల పెట్టుకోమని బేరసారాలు చేసుకున్న నీచులు వారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులై మందువరుసలో ఉన్నారని, ఆ దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏమిటో మీకు తెలుసు కదా అని పేర్కొన్నారు. విజ్ఞత ప్రదర్శించాల్సిన అక్కలు దొర చేతిలో, దొర పన్నిన కుట్రలో చిక్కుకుని బయటకు రాలేక, లోపల ఉండలేక మథన పడుతున్నారని చెప్పారు. మీరైనా వారికి దారిచూపాలని స్పీకర్‌ను కోరారు. మైక్ ఇస్తే మాట్లాడతారని, ఇతరులు మాట్లాడితే వినకుండా వాకౌట్ చేస్తారని చెప్పారు. వారి నుంచి ఏదైనా ఆశిస్తే అది కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టే అవుతుందని పేర్కొన్నారు. సొంత చెల్లెలు జైలులో ఉంటే మాట్లాడరని, రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి, స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కలను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించిన రేవంత్‌రెడ్డి.. వారిని తాను సొంత అక్కల్లా భావించానని తెలిపారు. ఒక అక్క తనను నడి బజారులో వదిలేసినా ఏమీ అనలేదని, మరో అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తే తనపై రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కానీ వారు మాత్రం అక్కడికి వెళ్లి మహిళా కమిషన్ ఛైర్పర్సన్లు, ఎమ్మెల్యేలు అయ్యారని తెలిపారు. నా ఎలక్షన్ కోసమే వచ్చిండు.. ఆయనపై కేసులు తీసేయండి అని వారు ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు.
దళితుడిని అధ్యక్షా అని పిలవాల్సి వస్తుందనే..
‘మాదిగల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నిస్తే సభకు రారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశారు. ఉప ముఖ్యమంత్రిని చేసి బర్తరఫ్ చేశారు. మల్లికార్జునఖర్గేని సోనియాగాంధీ జాతీయ అధ్యక్షుడిని చేశారు. తమరిని(ప్రసాద్ కుమార్) స్పీకర్ చేశారు. అప్పట్లో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్ నేరెళ్లలో దళితులను పరామర్శించడానికి రాష్ర్టానికి వస్తే ఎయిర్‌పోర్టులోనే ఆమెను అరెస్టు చేశారు. అది వాళ్ల నీతి.. వాళ్ల జాతి. మీరు స్పీకర్‌గా ఉన్నందున మీ ముందు కింద కూర్చోవాల్సి వస్తుందని, అలా కూర్చోకూడదనే ఉద్దేశంతోనే ఆయన సభకు రావడం లేదు’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు. ఐదేళ్లు తాను ఎమ్మెల్యేగా ఉంటే ఏనాడూ తనను నిలబడనీయలేదని, లోపలికి వచ్చిన వెంటనే మార్షల్స్‌ని పెట్టి గొర్రెలను ఈడ్చినట్టు ఈడ్చి బజారున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ సభ్యత్వాలు రద్దుచేసి అన్యాయంగా చేయని తప్పుకి వారికి ఉరి వేశారని మండిపడ్డారు.
స్కిల్ వర్సిటీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యులు సూచించిన కొద్దిపాటి మార్పులను పరిగణలోకి తీసుకొన్న స్పీకర్ బిల్లును పాస్ చేసి గవర్నర్ ఆమోదానికి పంపారు. బిల్లుపై చర్చించి సూచనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ శాసనసభ వ్యవహారాలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ సభ్యులు చేసిన సూచనలు, సలహాలు బిల్లులో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. తాము కొత్తగా తీసుకొచ్చిన యూనివర్సిటీలో గవర్నింగ్ బాడీలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలు, మైనారిటీలకు చాన్స్‌లర్ ద్వారా నామినేట్ చేసే అవకాశం ఉండాలని సభ్యులు కోరారని, తప్పకుండా కల్పిస్తామని పేర్కొన్నారు. బిల్లుకు అందరూ సంతోషంగా మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నట్టు భట్టి పేర్కొన్నారు.
ఆంత్రప్రెన్యూర్లను తయారు చేస్తాం
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఆంత్రప్రెన్యూర్లను తయారు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమలకు ఇంటర్న్‌షిప్ అందిస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్‌రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సూచించిన సవరణలకు మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం ఇచ్చారు. అనంతరం మండలిలోనూ స్కిల్ వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు.
కొట్టండి చప్పట్లు : భట్టి సైగలు
స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చివర్లో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతుండగా సభ్యుల్లో కొందరు పరధ్యానంలో ఉండగా, మరింకొందరు ఫోన్లు చూసుకుంటున్నారు. గమనించిన భట్టి వెనక్కి తిరిగి ‘చప్పట్లు కొట్టండి’ అంటూ సైగలు చేశారు. శ్రీధర్‌బాబు ప్రసంగం ఆసాంతం కరతాళ ధ్వనులతో సభ మార్మోగింది. అలాగే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేల సీటు వద్దకు వెళ్లి చప్పట్లు కొట్టాలని సూచించారు.
ప్రస్తుత నోటిఫికేషన్లకూ వర్గీకరణ
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ మాదిగ, మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలిపారు.
17 రకాల కోర్సులు
స్కిల్ యూనివర్సిటీలో హెల్త్‌కేర్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, ఏఐ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, టూరిజం అడ్ హాస్పిటాలిటీ, ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికిల్స్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్, కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్, ఈ-కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రెన్యువబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్, బ్యూటీ అండ్ వెల్నెస్, మల్టీమీడియా గేమింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్, డిజిటల్ డిజైన్ తదితర 17 రకాల కోర్సులు అందుబాటులో ఉం టాయి. ఈ ఏడాది మాత్రం 6 కోర్సు ల్లో రెండువేల మందికి మాత్రమే అడ్మిషన్లు ఇస్తారు.
పాలకులు బాధ్యతగా ఉండాలి
సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అప్రెసియేషన్ బిల్లులో బీజేపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన పాలకులు ఇలా వ్యవహరించడం సరికాదు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమాలను ఎండగడుతూ, బీజేపీ ఎప్పటికీ ప్రజలపక్షాన పోరాటం చేస్తుంది.
– బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
యూనివర్సిటీ పెట్టగానే సరిపోదు
ఒకే రోజున యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును, నిర్మాణానికి శంకుస్థాపన చేయడం బాగానే ఉంది. దాని నిర్వహణపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కొనసాగించాలి. బాసర ట్రిపుల్ ఐటీలా యూనివర్సిటీని పెట్టి వదిలేయకూడదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వీసీగా గవర్నరే ఉన్నారు. స్కిల్ యూనివర్సిటీకీ గవర్నర్‌నే వీసీగా కొనసాగించాలి.
– ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
దమ్ముంటే మైక్ ఇవ్వండి
ఇలాంటి సభను ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య వాదనలను పరిష్కరించే బాధ్యత స్పీకర్‌దే. సభా హక్కుల ప్రకారం వివరణ ఇచ్చుకునేందుకు మైక్ అడగడం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హక్కు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మైక్ ఇవ్వాల్సిందే. ప్రభుత్వానికి సమాధానం చెప్పే దమ్ముంటే మైక్ ఇవ్వాలి. లేదనుకుంటే వారిని చర్చలకైనా పిలవాలి. లేదంటే సస్పెండైనా చేసి సభను ఆర్డర్లో పెట్టాలి.
– ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్
మన బిడ్డలను ఆదుకోవాలి
విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణబిడ్డలకు సహాయం అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఒక హెల్ప్‌లైన్ నంబర్ పెట్టాలి.
– ఎమ్మెల్సీ తాతా మధు
వైద్య కళాశాలలో సమస్యలు
మహబూబాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలో పూర్తిస్థాయి వసతు లు కల్పించాలి. వైద్య కళాశాలలోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రంలో మురుగుకాల్వలు లేవు. రోడ్డుపై నీరు పేరుకుపోతుంది.
– ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు
పూర్తి రుణమాఫీ చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయాలి. ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఎలాంటి పరిమితులు లేవని చెప్పి అమలులో అనేక కోతలు పెడుతున్నారు.
– ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి
చేనేత బకాయిలు చెల్లించాలి
రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలను అడ్డుకోవాలి. వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలి.
– ఎమ్మెల్సీ ఎల్ రమణ
దవాఖానలో సిబ్బంది కొరత
రాష్ట్రంలో బస్తీ దవఖానాలలో మందులు, వైద్య సిబ్బంది కొరత నెలకొన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో బస్తీ దవాఖానాల్లో మందులు ఉండేవి. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేవారు. వైరల్ జ్వరాలు పెరిగి బస్తీ దవఖానాల్లో రోగులు పెరుగుతున్నారు.
– మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ
మౌలిక వసతులు కల్పించాలి
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని అటవీప్రాంతాల్లోని గ్రామాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులకు మౌలిక వసతులు కల్పించాలి.
– ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి
ఆహారకల్తీని అరికట్టాలి
రాష్ట్రంలో ఆహారపదార్థాల కల్తీ విపరీతంగా పెరిగింది. నూనెలు, పప్పులు, పాలు, నీళ్లతోపాటు అన్ని వస్తువుల్లో కల్తీ పెరిగింది. వీటిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కల్తీకి పాల్పడుతున్న వ్యాపారులను శిక్షించాలి. జీవో 66 సమస్యను పరిష్కరించాలి.
– ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
వేతనాలు చెల్లించాలి
ఇటీవల పదవీకాలం ముగిసిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలను విడుదల చేయాలి. వారు పదవీకాలంలో చేసిన పనుల బిల్లుల బకాయిలు కూడా చెల్లించాలి. – ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం
ఐఏఎస్ అధికారిపై చర్యలు తీసుకోవాలి
దివ్యాంగులపై బాధ్యతాయుతమైన ఉన్నత పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్య లు దురదృష్టకరం. దివ్యాంగులపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
– ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి