CM Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు కావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. పలు పథకాలకు చెల్లింపులు కూడా సక్రమంగా జరగడం లేదని కూడా ఆయన పరోక్షంగా ఒప్పుకున్నారు. అదే సమయంలో ఇందుకు కారణం బీఆర్ఎస్ పార్టీ, నాటి ప్రభుత్వమేనని ఆరోపించారు. తద్వారా ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతిపక్షం మీదికి నెట్టేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందని, జరగాల్సిన రీతిలో పనులు జరగడం లేదని ప్రజలు, మేధావులు అభిప్రాయపడుతుండటం కొన్ని మీడియా సంస్థలు చేసిన సర్వేల్లో కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వంద రోజుల్లోనే హామీలు అమలుచేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది గడిచినా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తూ వివిధ సామాజిక వర్గాలు రోడ్డెక్కుతున్న సందర్భంలో.. ముఖ్యమంత్రి ఆ వైఫల్యానికి విపక్షమే కారణమని చెప్పడానికి ప్రయత్నించడం పట్ల రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతున్నది.
అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమలు చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. శాసనసభలో శనివారం రైతుభరోసాపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులకు రైతు భరోసా ఇవ్వలేకపోతున్నామని, కౌలు రైతులకు సాయం చేయలేకపోతున్నామని, మహిళలకు ఇస్తామన్న డబ్బు ఇవ్వలేకపోతున్నామని, ఫీజు రీయింబర్స్మెంట్ సమయానికి చేయలేకపోతున్నామని, హాస్టళ్ల బిల్లులు కట్టలేకపోతున్నామని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు తులం బంగారం ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పుల కారణంగానే హామీలు అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. రాష్ర్టానికి వస్తున్న ఆదాయం, తెస్తున్న అప్పులన్నీ గతంలో చేసిన అప్పులు చెల్లించేందుకే సరిపోతున్నాయని అన్నారు. ‘నా దగ్గర రూ.1.27 లక్షల కోట్లు ఉంటే అద్భుతాలు సృష్టించేవాడిని. రైతులకు అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చేవాడిని, ఫీజు రీయింబర్స్మెంట్ రూపాయి బకాయి లేకుండా చెల్లించేవాడిని, దవాఖానలకు బిల్లులు చెల్లించడమే కాదు.. నెల అడ్వాన్స్ ఇచ్చేవాడిని. ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ అయినా ఆలస్యం అయిందంటే ఆ పాపం ఈ పాపాత్ములదే’ అని వ్యాఖ్యానించారు. తాము ఏడాది కాలంలో రూ.1.27 లక్షల కోట్లు అప్పులు తెచ్చామని చెప్పారు.
రూ. 2 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామన్నాం
రుణమాఫీ పూర్తి చేయలేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం స్పందించారు. తమ పార్టీ మ్యానిఫెస్టోలో రూ. 2 లక్షల వరకు మాత్రమే రైతుల అప్పు తీరుస్తామని చెప్పామని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 25,35,963 మంది రైతులకు రూ. 20,616 కోట్లు రుణమాఫీ చేసిందని తెలిపారు. ఒకవేళ రూ. 2 లక్షల లోపు రుణం మాఫీకానివారు ఎవరైనా ఉంటే లెక్కలు ఇవ్వాలని సూచించారు. మాట తప్పని, మడప తిప్పనిది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రూ. 2 లక్షలకు పైగా రుణాలు ఉన్నవారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు సీఎం స్పందించలేదు.
ఇక్కడున్నోడిని తొక్కితే..
ఒక దశలో సీఎం రేవంత్‌రెడ్డి సహనం కోల్పోయి బీఆర్ఎస్ సభ్యులపై దూషణ పర్వానికి దిగారు. ‘ఇక్కడికి ఉత్తగ రాలే.. తొక్కుకుంటూ వచ్చిన.. ఇక్కడున్నోడిని తొక్కితే అక్కడికిపోయిండు’ అని వాఖ్యానించారు. ‘పదేండ్లలో వీళ్లు చేసిన పాపానికి ఉరి తీసినా తప్పులేదు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నా నిబద్ధతను మీరా ప్రశ్నించేది.. మీరెంత.. మీ స్థాయెంత’ అంటూ మండిపడ్డారు. తాను, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి గన్మెన్లు లేకుండా నల్లగొండ జిల్లాలో ఎక్కడికి రమ్మన్నా వస్తామని, కేటీఆర్, హరీశ్‌రావు కూడా రావాలని సవాల్ విసిరారు. మూసీని అభివృద్ధి చేయాలో వద్దో ప్రజలనే అడుగుదామని అన్నారు. రూ.100 కోట్లు అదానీకి వెనక్కి ఇవ్వడం వల్ల తనకు వచ్చిన నష్టమేమీ లేదని చెప్పారు.
సీఎం ప్రసంగంపై బీఆర్ఎస్ అభ్యంతరం
రైతు భరోసాపై చర్చ పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి ఇతర విషయాలను ప్రస్తావించడంపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను కేవలం రైతుభరోసాపైనే మాట్లాడాలని ఆదేశించి.. ముఖ్యమంత్రి మాత్రం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని స్పీకర్‌కు తెలిపారు. ముఖ్యమంత్రి అప్పుల విషయంలోతప్పుడు లెక్కలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ దశలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొన్నది.
ప్రభుత్వంలో క్రైస్తవులకు సముచిత స్థానం
ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో క్రైస్తవులకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాత చేపట్టనున్న ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులోనూ ప్రాధాన్యమిస్తామని తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ మిరాకిల్ మంత్ అని, ఏసుప్రభువు, సోనియాగాంధీ, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది ఈ నెలలోనేని గుర్తుచేశారు. ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని, రాష్ట్రంలో క్రైస్తవులకు వందశాతం రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు.
లగచర్లలో రాజకీయం
లగచర్లలో భూమి విలువ తక్కువ ఉన్న 1300 ఎకరాల్లో పరిశ్రమలు పెట్టి, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రయత్నించామని రేవంత్ అన్నారు. కానీ కోట్ల రూపాయలు పంపించి రైతులతో రాజకీయం చేయించారని ఆరోపించారు. వారికి మద్యం తాగించి అధికారులపై దాడులు చేయించారని బీఆర్ఎస్పై ఆరోపణలు చేశారు.
రాష్ట్ర అప్పులు రూ. 7.22 లక్షల కోట్లు…
ఈ నెల 18 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.7,22,788 కోట్లు అని సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మార్కెట్ రుణాలు రూ. 3,89,673 కోట్లు అని, ఎస్పీవీ, కార్పొరేషన్లకు గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే రుణాలు రూ.1,27,208 కోట్లు అని, ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్లు తీసుకుని, కార్పొరేషన్లే చెల్లించే రుణాలు రూ.95,462 కోట్లు అని, గ్యారెంటీలు లేకుండా కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు రూ. 59,414 కోట్లు అని వివరించారు. మొత్తంగా శ్వేతపత్రంలో పెట్టిన అప్పులు రూ. 6,71,757 కోట్లు అని తెలిపారు. ఇవి కాకుండా బిల్లుల బకాయిలు రూ. 40,154 కోట్లు కలిపితే మొత్తం అప్పులు రూ. 7,11,911 కోట్లు అని వివరించారు. ఇక తాము తీసుకున్న అప్పు రూ.1.27 లక్షల కోట్లు అని తెలిపారు. ఇందులో పాత అప్పులు, బకాయిలు చెల్లించగా ప్రస్తుత అప్పు రూ.7,22,788 కోట్లు అని సీఎం తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన రూ.15వేల కోట్ల అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేశారన్న హరీశ్‌రావు వ్యాఖ్యలపై సీఎం సమాధానం ఇవ్వలేదు.
స్వతంత్ర భారత చరిత్రలోనే ఎవరూ చేయనంత రుణమాఫీ చేసినం
27 రోజుల్లో మూడు విడుతల్లో రూ.2 లక్షల వరకు రుణాలున్న వారికి రూ.17,869 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మాది. ఈ భారత దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కూడా చేయనంత గొప్పగా రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో చేశాం. నవంబర్ 30న 3.13 లక్షల మంది రైతులకు రూ.2,747 కోట్లు మళ్లీ రుణమాఫీ చేసినం. మొత్తంగా మొదటి సంవత్సరంలో 25,35,963 మంది రైతులకురూ.20,616 కోట్లు రుణమాఫీ చేసినం. ఇది మా పనితనం
– సీఎం రేవంత్‌రెడ్డి
రుణమాఫీ కానే కాలె… మాకెప్పుడు చేస్తరు?
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ధనోరా(బీ) సమీపంలోని ప్రధాన రోడ్డుపై బైఠాయించిన రైతులు. రూ.2 లక్షల వరకు రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తుండగానే.. అదే సమయంలో రుణామాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగడం గమనార్హం.