Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): పెద్దంతరం లేదు.. చిన్నంతరం లేదు.. ఉద్యమ నేత అన్న గౌరవం లేదు.. తెలంగాణ తెచ్చిండన్న మర్యాద లేదు.. రాజకీయాన్ని పాతాళమంత పతనానికి తీసుకుపోతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మరో దుర్మార్గానికి పాల్పడుతున్నాడు. దాదాపు తన తండ్రి అంత వయసున్న కేసీఆర్‌ను పట్టుకొని పచ్చి బూతులు తిడుతున్నాడు.
మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను అనరాని మాటలు అన్నాడు. ఉద్యమ నేత, అభివృద్ధి ప్రదాతను పత్రికల్లో రాయడానికి వీల్లేని భాషలో దూషించాడు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావిస్తూ వాడిన పదప్రయోగం పట్ల రాజకీయ పరిశీలకులు, పాత్రికేయులు, విద్యావంతుల్లో తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమవుతున్నది. మొన్నటికి మొన్న తనంతట తానుగా మర్యాదగా మాట్లాడుకుందాం.. అంటూ సుద్దులు చెప్పిన రేవంత్‌రెడ్డి రెండు రోజుల వ్యవధిలోనే నోటికొచ్చినట్టు కేసీఆర్‌ను తూలనాడటం గమనార్హం.
ఓటమి భయంతో పిచ్చిమాటలు
ఇటీవలి కాలంలో వెలువడుతున్న సర్వేలన్నీ బీఆర్ఎస్దే ఘనవిజయమని సూచిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఇప్పటిదాకా అభ్యర్థులనే ఖరారు చేసుకోలేకపోయింది. దీనికితోడు కాంగ్రెస్‌లో టికెట్ల రచ్చ కొనసాగుతున్నది. గాంధీభవన్ దగ్గర దిష్టిబొమ్మల దహనాలు.. తన్నులాటలు.. గుద్దులాటలు సాగుతున్నాయి. సీనియర్ లీడర్లు ఎవరి కుంపటి వారు పెట్టుకొని.. గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఓటమి తప్పదని ఫ్రస్టేషన్లో రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలవల్లే కార్యకర్తలు కూడా దారితప్పుతున్నారని, ఈ ప్రశాంత తెలంగాణలో హింసకు అగ్గిరాజేస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. మొన్నటికి మొన్న దుబ్బాక ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త ఒకడు హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా రేవంత్‌రెడ్డి దీన్ని మసిపూసి మారేడుకాయ చేసేందుకు సోషల్‌మీడియాను వేదికగా చేసుకొని, కుటిల యత్నాలు చేశాడు.
ఇటు విలేకరుల సాక్షిగా విపరీత వ్యాఖ్యలు చేశాడు. మొన్న అమెరికాలో రైతులకు 3 గంటల కరెంటు చాలని వీడియోల సాక్షిగా అన్న రేవంత్‌రెడ్డి.. అనంతరం ఆ మాటే అనలేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. తాజాగా, తెలంగాణకు పితృసమానుడైన కేసీఆర్‌ను కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. కాగా, రేవంత్‌రెడ్డి వైఖరి రాష్ట్ర రాజకీయాలను దిగజారుస్తున్నదని, విలువలకు పాతరేస్తున్నదని, ప్రమాణాలను పాతాళానికి తీసుకుపోతున్నదని రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను నోటికొచ్చినట్టు మాట్లాడిన రేవంత్‌పై తెలంగాణ సమాజం మండిపడుతున్నది.
రేవంత్ లొడలొడ.. సభ వెలవెల

నారాయణపేట జిల్లా మక్తల్‌లో మంగళవారం కాంగ్రెస్ నిర్వహించిన సభ జనం లేక వెలవెల బోయింది. సభా ప్రాంగణం అంతా ఖాళీ కుర్చీలతో ఇలా దర్శనమిచ్చింది.
-మక్తల్‌టౌన్