CM KCR | టీపీపీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెలిగారు. కొడంగల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రేవంత్‌రెడ్డి భూకబ్జాదారు. భూములు యాడపడితే ఆడ ఈ జిల్లాలోనే చాలా కబ్జాలు పెట్టిండు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తరటా? మరి దానికాడ ఏం పెడుతారట అంటే.. భూమాత అని పెడుతరట. అది భూమాతనా భూమేతనా? మీ అందరూ ఆలోచన చేయాలి. ధరణినితో రైతుబంధును పంపిస్తున్నాం. కడుపులో చల్లకదలకుండా, యే ఆఫీసుకు వెళ్లకుండా, ఎవడికి రూపాయి లంచం ఇవ్వకుండా బ్రహ్మాండంగా హైదరాబాద్‌లో ఏంత వేస్తున్నమో అంత మీ బ్యాంకులో పడుతుంది. మీ సెల్ఫోన్లు టింగ్ టింగ్‌మని మోగుతున్నయ్. ఆ డబ్బులతో ఏది అవసరం ఉన్నవాళ్లు అది కొనుక్కుంటున్నరు. మంచిగా పంటలు పండించుకుంటున్నరు’ అన్నారు.
‘ధరణిని తీసివేస్తే రైతుబంధు ఎలా రావాలి ? కాంగ్రెస్ నాయకులు ఏం చెబుతున్నరంటే.. ధరణిని తీసివేస్తం.. మళ్లీ పాత సిస్టమ్ పెడుతాం.. పహానీలో మళ్లీ 30 కాలమ్స్ పెడుతాం.. మళ్లీ కౌలుదారు కాలమ్ పెడుతాం.. వీఆర్వోలు, పట్వారీలను తీసుకువస్తాం అంటున్నారు. మళ్లీ పాత పద్ధతి రావాల్నా? ఇవాళ మీరు భూమి అమ్మినా, కొన్నా నిమిషాల మీద రిజిస్ట్రేషన్ అవుతున్నది. యాడికో పోవాల్సిన అవసరం లేదు. మీ మండలంలోనే అవుతుంది. మ్యుటేషన్, పట్టా అన్నీ ఒకేసారి అవుతున్నయ్. ఏ బాధ లేకుండా పాస్‌బుక్‌లు వస్తున్నయ్. ధరణిని తీసివేస్తే ఎంత విధంగా జరుగుతుంది ? ఎంత ప్రమాదం వస్తుంది? మళ్లీ పైరవీకారులు, దళారీలు వస్తరు. రైతుబంధు రావాలంటే ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్తే.. నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది.. రైతుబంధు ఎంత వస్తది అంటడు. ఏడెకరాలు ఉందంటే నాకు రూ.30వేలు ఇయ్యి.. లేకపోతే సంతకం పెట్ట అంటడు. మళ్లీ మొదటికిపోయినట్టే కదా? మళ్లీ భూములు కబ్జా అవుతాయ్ కదా? ఈ ప్రమాదాలన్నీ ఉన్నయ్. అందుకే ఆలోచన చేయాలంటున్నా. ఆలోచన లేకుండా ఓటు వేస్తే 30 రోజులు మురిపించోటళ్లకు ఓటు వేస్తే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకోసం నిజాయితీతో ఆలోచించి ఓటువేయాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.