రానున్న 2028 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరు. తక్కువ కాలంలో ఇంతటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని ఏనాడూ చూడలేదు.. తిరిగి గులాబీ పార్టీ అధికారంలోకి రావడం.. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.
-కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రియల్ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తి లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను తెగనమ్ముతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలనను పక్కనబెట్టి, ప్రజలను గాలికొదిలేసి కుంభకోణాలకు తెరలేపారని దుయ్యబట్టారు. మొదట మూసీ, తర్వాత లగచర్ల, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, మొన్న హెచ్‌సీయూ, నేడు హైదరాబాద్ పారిశ్రామికవాడల్లోని భూములను అమ్మకానికి పెట్టారని విమర్శించారు. నాడు పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన రూ.5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాలను ముఖ్యమంత్రి.. తన అన్నదమ్ములు, అనుయాయులైన 500 మందికి విల్లాలు, ఇండ్లు కట్టుకునేందుకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
ఈ వ్యవహారంలో సగం సొమ్మును కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గురువారం తెలంగాణభవన్‌లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఎవడబ్బ సొమ్మని విలువైన భూములను ధారాదాత్తం చేస్తున్నారని నిలదీశారు. హిల్ట్ పాలసీ రద్దుచేసి వెంటనే భూములను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఎట్టిపరిస్థితిలోనూ ఊరుకొనే ప్రసక్తిలేదని, ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని, అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తామని హెచ్చరించారు. ఈ అక్రమ వ్యవహారంలో తప్పుచేసిన వారు భవిష్యత్తులో తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

వివిధ శాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే పారిశ్రామిక భూముల అమ్మకానికి క్యాబినెట్ సబ్‌కమిటీ సిఫారసు చేసినట్టుగా పేర్కొంటూ రూపొందిన డ్రాప్ట్ కాపీ. వాస్తవానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి పేరుమీద ఇది విడుదల కావాలి. కానీ ‘నన్నెవరూ సంప్రదించలేదు. నాతో చర్చించకుండానే తయారు చేసిన డ్రాఫ్ట్ కాపీపై నేనెలా సంతకం చేస్తాను?’ అంటూ పరిశ్రమలశాఖ ఉన్నతాధికారి సీఎంవోలో ఉండే మరో ఉన్నతాధికారికి లేఖ రాయడం తాజా పరిణామం.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన చేసి బీసీలకు విద్య, ఉద్యోగ, కాంట్రాక్టులు, రాజకీయాల్లో 42% కోటా ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ధోకా చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. బీసీలకు బడ్జెట్లో ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి రెండు బడ్జెట్లలో కలిపి రూ.12 వేల కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో బీసీలకు 24% రిజర్వేషన్లు ఇస్తే, రేవంత్‌రెడ్డి 17 శాతానికి కుదించి ద్రోహం చేశారని దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కిన రేవంత్‌కు స్థానిక ఎన్నికల్లో ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలోనే తెలంగాణకు న్యాయం జరిగిందని కేటీఆర్ వివరించారు. కేసీఆర్.. ఉత్తర తెలంగాణకు నీరందించేందుకు కాళేశ్వరం, దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు అంకురార్పణ చేశారని గుర్తుచేశారు. రూ.93 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేయడమే కాకుండా, పాలమూరును 90% పూర్తిచేశారని వివరించారు. రివర్స్ ఇరిగేషన్‌తో రివర్ మైగ్రేషన్ సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని స్పష్టంచేశారు.
పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం తప్ప రెండేండ్లలో సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాకు, రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమని కేటీఆర్ విమర్శించారు. ‘తట్టెడు మట్టి ఎత్తలేదు.. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు.. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు’ అని దుయ్యబట్టారు. ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇచ్చి ఇంట్లోని పురుషులకు డబుల్ చార్జీలు పెంచి దండుకుంటున్నారని, చివరకు పిల్లల బస్సు పాస్‌లను కూడా వదిలిపెట్టకుండా రేట్లు పెంచారని విమర్శించారు. 24 నెలల్లో పాలమూరుకు చుక్కనీరు కూడా ఇవ్వని ఘనుడని చురకలంటించారు.
రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన పాపానికి తెలంగాణ ప్రజలు అరిగోస పడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డివి గారడి మాటలు తప్ప చేసేదేమీ ఉండదనే విషయం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతున్నదని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ఈ సర్కారును సాగనంపుదామా? అని ప్రజలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.
పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీ సంస్థాగత ప్రక్రియ మొదలు పెడతామని కేటీఆర్ ప్రకటించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా, నగరస్థాయి వరకు కొత్త కమిటీలను నియమిస్తామని స్పష్టంచేశారు. అనుబంధ కమిటీలను సైతం నియమిస్తామని చెప్పారు. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవుల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. మూడేండ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు.
కేసీఆర్ పాలనలోనే పాలమూరు జిల్లా సస్యశ్యామలమైందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం, నార్లాపూర్, ఏదుల, వట్టెంల, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లతోపాటు 600 మీటర్ల ఎత్తున ఉండే లక్ష్మీదేవిపల్లె రిజర్వాయర్‌ను పూర్తిచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు.
ప్రజలతో కలిసి పనిచేయాలి. కలిసికట్టుగా సర్కారు వైఫల్యాలపై పోరాటం చేయాలి. కార్యకర్తలు కదనరంగంలోకి దూకి.. ఊరూరా కేసీఆర్లుగా మారి మోసపూరిత కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలి.
-కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు రూపొందించిన 15వ దీక్షా దివస్ పోస్టర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం విడుదల చేశారు. అంతకుముందు 11 రోజులపాటు నిర్వహించనున్న కార్యక్రమాల షెడ్యూల్‌ను ఖరారు చేయగా ఆమోదించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం, అబ్దుల్ మకీత్ చందా, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, ఇనాయత్ అలీబకరీ, సయ్యద్ అక్బర్‌హుస్సేన్, మహ్మద్ షరీఫుద్దీన్, మీర్ మహ్మద్‌అలీ, మహ్మద్ నాయకుద్దీన్, జహీరుద్దీన్ యూసుఫీ, సయ్యద్ ఫహీం, షేక్ మహ్మద్‌అజార్, మాజీ కార్పొరేటర్ మీర్ తాహెర్‌అలీ, మహ్మద్ అస్లాం, జానీమియా, ముజాహిద్ ఖురేషీ, జమాల్‌ఖాన్, మహ్మద్‌అలీ, సైఫుద్దీన్లోదీ, తయ్యబ్, జాఫర్, అఫ్జల్, సుల్తాన్ మీర్జా, మీర్జా అషోబేగ్, మహ్మద్ షయాన్, ముజాహిద్చందా తదితరులు పాల్గొన్నారు.