ఖలీల్‌వాడి, జూన్ 10 : చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించిన ఉద్యమ యోధుడు కేసీఆర్‌కు ఇన్ని వేధింపులా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేకనే ఎలాంటి లోపాలు లేని కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కుతూ ఆయనకు నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ కుట్రలో భాగమేనని మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. కేసీఆర్‌ను విచారణకు పిలవడాన్ని తెలంగాణ ప్రజలు బ్లాక్‌డేగా పరిగణిస్తున్నారని తెలిపారు. కేసులు, విచారణకు భయపడేది లేదని స్పష్టంచేశారు. ఉద్యమనేత కేసీఆర్‌తో పెట్టుకున్నోళ్లు ఎవరైనా మట్టికొట్టుకుపోతారని హెచ్చరించారు.
గద్దెనెక్కిన తొలిరోజు నుంచే కక్షసాధింపుల పర్వానికి తెరలేపిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని పేర్కొన్నారు. తనవి బీజేపీ, టీడీపీ మూలాలని రేవంతే స్వయంగా చెప్పుకున్నారని గుర్తుచేశారు. రేవంత్ చదివిన మోదీ, చంద్రబాబు స్కూళ్లకు చీటింగ్ తప్ప రేటింగ్ లేదని ఎద్దేవా చేశారు. పేమెంట్ కోటాలో రాహుల్ గాంధీ వద్ద ముఖ్యమంత్రి ఉద్యోగం సంపాదించుకుని తెలంగాణను దోపిడీ చేస్తూ ఢిల్లీకి డబ్బుల మూటలు మోస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి తన అసలు రంగు తెలియడంతో పదవిని కాపాడుకునేందుకు రాహుల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు.