గజ్వేల్, అక్టోబర్ 22: మల్లన్నసాగర్ నిర్వాసితులపై కాంగ్రెస్ నేతలు కపట ప్రేమ చూపుతున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన రూ.6 లక్షల పరిహారాన్ని రెట్టింపు చేసి రూ.12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాడు ఏటిగడ్డకిష్టాపూర్‌లో చేసిన నిరాహార దీక్షలో రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతాప్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం అందజేసిందని తెలిపారు. అబద్ధపు ప్రచారాలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు రెట్టింపు పరిహారం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. కోర్టు తీర్పును కాంగ్రెస్ ప్రభుత్వం ధిక్కరిస్తున్నదని, మిగిలిన 65 ఏండ్లు నిండిన వారికి వెంటనే ప్యాకేజీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.