మామిళ్లగూడెం, జూన్ 19 : యాదవుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివక్ష చూపుతున్నారని తెలంగాణ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డీ రాజారాంయాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో యాదవులు, మున్నూరు కాపులు, ఎంబీసీలకు మంత్రి పదవులు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో మొదటి నుంచీ కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న మున్నూరుకాపులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. బీసీ కులాల్లో నోరులేని కులాలుగా పేరొందిన ఎంబీసీలకు మంత్రి పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు.
‘బీసీల రిజర్వేషన్లు – మంత్రి పదవుల కేటాయింపు’ అనే అంశంపై తెలంగాణ యాదవ మహాసభ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుమ్మా రోశయ్య అధ్యక్షతన ఖమ్మంలోని జడ్పీ మీటింగ్ హాల్లో గురువారం జరిగిన సదస్సులో రా జారాంయాదవ్ మాట్లాడారు. యాదవ జాతి నేతలైన ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్‌యాదవ్ మద్దతవ్వడం వల్లనే నాడు యూపీఏ-1, యూపీఏ-2లో కాంగ్రెస్ ప్రభుత్వం ప దేండ్లు అధికారంలో నిలబడిందని గుర్తుచేశారు. బీసీలకు మంత్రి పదవుల సాధన కోసం 30న యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు.