Farmers | ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే విపక్ష నాయకుల మీద కేసులు! ప్రశ్నిస్తే ప్రజాసమూహం మీద కేసులు! సోషల్ మీడియాలో పోస్టు పెడితేనే కాదు.. ఆ పోస్టులను షేర్ చేసినా నాన్‌బెయిలబుల్ కేసులు! ఎరువుల అందక, పంట కొనక కడుపుమండి రైతులు ఆందోళనకు దిగితే వారి చేతికి బేడీలు! అడ్డగోలు భూసేకరణకు అడ్డం పడితే ఏకంగా జైళ్లు! ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైనా, ఎవరైనా గళం విప్పితే చాలు.. దాడులు, దౌర్జన్యాలు! ఇదీ రెండున్నరేండ్లుగా రాష్ట్రంలో సాగుతున్న నిర్బంధపాలన. ఇదీ.. కాంగ్రెస్ చెప్పని ఏడో గ్యారెంటీ!
రాష్ట్రంలో దాదాగిరీ దర్బార్ నడుస్తున్నది. ఉద్యోగుల నుంచి కర్షకుల దాకా.. విద్యార్థుల నుంచి నిరుద్యోగుల వరకు.. కార్మికుల నుంచి కర్షకుల దాకా.. అందరిపైనా అదే ఉక్కుపాదం. ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ఎత్తిచూపినా భరించలేని స్థితి. రాష్ట్రంలో పౌరహక్కులు.. రాజుగారి దేవతావస్ర్తాల్లా మారిన దుస్థితి! గుడ్ గవర్నెన్స్.. గూండాగిరీగా మారిన దౌర్భాగ్యం! హామీ ఇచ్చిన అభయ హస్తమే.. భయహస్తంగా మారిన దుర్మార్గం!
వడ్లు కొనాలని అడిగినా, ఎరువులు ఇవ్వాలని కోరినా కేసులే! కరెంటు, కాల్వల నీళ్లు వస్తలేవని గట్టిగా అన్నా కేసులే! కేసు ఎందుకు పెడుతున్నరని అడిగితే ఇంకో కేసు! ప్రశ్నించే నోటిని చెయ్యి మూసేస్తున్నది. నిలదీసే గొంతును నిర్బంధంగా నులుముతున్నది.
వరంగల్, మే 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతన్నపై రేవంత్ సర్కార్ పగబట్టింది. అదునుకు ఎరువులు అందక పంట ఆగమైతదని ఎప్పుడిస్తారని అడిగితే కేసులు పెడుతూ, గాలివానకు రెక్కల కష్టం దెబ్బతింటున్నా ఇంకా పంట కొనరా? అని కడుపుమంచి రోడ్డెక్కితే అరెస్టులు చేయిస్తున్నది. భూముల అడిగితే బెదిరింపులకు దిగడం దౌర్జన్యానికి తెగబడుతున్నది. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ప్రాంతమైనా సరే.. అటు ఆ పార్టీ నాయకులు, ఇటు పోలీసులను ఎగదోసి ప్రతాపం చూపిస్తున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు వెన్నుదన్నుగా ఉండాల్సి కాంగ్రెస్ సర్కార్.. రోడ్డెక్కుతున్నారనే అక్కసుతో వారిని సరిహద్దులో శత్రువును చూసినట్టు చూస్తూ రెండున్నరేండ్ల నుంచి రాక్షసంగా వ్యవహరిస్తున్నది. శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులపై అశాంతి కాముకులుగా ముద్రవేసి నాన్‌బెయిలబుల్ కేసుల పేరుతో వేధిస్తూ నరకం చూపిస్తున్నది.
రైతుల బతుకు దాదాపు రెండు నెలలుగా రోడ్డుపాలైంది. పంట ఎప్పుడు కొంటరని అడిగిన పాపానికి సర్కార్ కత్తి గట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నది. అది ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇలాకా అయినా, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇలాకా అయినా.. నియోజకవర్గం ఏదైనా సరే రేవంత్ సర్కార్ తోఫా ఒక్కటే.. రైతులపై కేసులు, జైళ్లు అన్నట్టుగా రాష్ట్రంలో పాలన సాగుతున్నది. తాజాగా జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఎనిమిది రైతులను ఏకంగా అశాంతి జనకులుగా ముద్రవేస్తూ వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అంతకుముందు రోజు భట్టి విక్రమార్క ఇలాకాలో తాము పండించిన మక్కజొన్న పంట 55 రోజులుగా కాంటా పెట్టడం లేదని ఆగ్రహించిన రైతులు ఈ నెల 22న చింతకాని సొసైటీ గేట్‌కు తాళం నిరసన తెలిపారు. రైతుగోడును దాదాపు రెండు నెలల వారి గోస దృష్టిలో పెట్టుకొని వారి సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఉల్టా రైతులపైనే కేసు నమోదు చేసింది. అలాగే, నిర్మల్ జిల్లాలో పంట కొనుగోలులో ఆలస్యం అవుతుందని ఆగ్రహించిన మక్క రైతులు నిర్మల్-భైంసా ప్రధాన రహదారిపై ధర్నా చేసిన 13మంది రైతులపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలా ఇప్పుడే కాదు రెండున్నరేండ్లుగా పంట కొనుగోలు చేయాలని కోరిన ప్రతీ సందర్భంలో రైతులపై రాక్షసంగా వ్యవహరిస్తునే ఉన్నారు. వాటిల్లో కొన్ని ఉదంతాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా చింతకానిలో సొసైటీ గేట్‌కు తాళం వేసినందుకు కేసులు నమోదైన రైతులు
యూరియా కోసం తెలంగాణ రైతాంగం మునుపెన్నడూలేని అవస్థలకు గురవుతున్నది. ఈ రెండున్నరేండ్లుగా వానకాలం, యాసంగి సీజన్ ఏదైనా కష్టమొక్కటే అన్నరీతిలో రైతులు యూరియా పాట్లు పడాల్సి వస్తున్నది. యూరియా ఏదని అడిగినందుకు రేవంత్ సర్కార్ అన్నదాతపై అక్కసు వెళ్లగక్కి పోలీసులను ఉసిగొలిపి బనాయించిన కేసులు అనేకం ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్ష్మణ్ అనే రైతు గోదాం వద్దకు వెళ్లి సర్కార్‌ను ప్రశ్నించిన పాపానికి కేసు నమోదైంది. గోదాం వద్ద తన ఆవేదన చెప్పుకొంటూ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన పాపానికి ప్రభుత్వం కక్షగట్టిన తీరు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన విష యం తెలిసిందే. ఇక నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొత్తపేట తండాకు చెందిన ధనావత్ సా యిసిద్ధు నిరుడు సెప్టెంబర్‌లో మిర్యాలగూడలో యూరియా ధర్నాలో పాల్గొన్నందుకు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సంచలనం రేపింది.
తాము అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని గొప్పలు చెప్పుకొన్నారు. అధికారంలోకి రాగానే తమకు ఇచ్చిన హామీ మరచారా? ప్రశ్నించిన రైతులపై రేవంత్ సర్కార్ కత్తిగట్టింది. తాము దేవుండ్ల మీద ఒట్ల వేస్తే వాళ్లే కిమ్మనకుండా ఉన్నారు మీరెంత అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షగట్టింది. రూ.2లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారని అడిగినందుకు 2024 ఆగస్టులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగంపై రేవంత్ సర్కార్ కేసులు పెట్టింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడిలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని 13మంది రైతులపై, బజార్హత్నూర్ మండలకేంద్రంలో నలుగురు రైతులపై కేసులు మోపారు.

కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ తీరుకు నిరసనగా చెప్పుతో కొట్టుకోవాలన్నందుకు కేసు నమోదైన రైతు లక్ష్మణ్
కాంగ్రెస్ సర్కార్ రైతులపై కబ్జాకోర్ ముద్రవేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకించి రాజన్న-సిరిసిల్ల జిల్లా రైతాంగంపై రేవంత్ సర్కార్ పగబట్టింది. ప్రభుత్వ భూమిని రైతులు అక్రమంగా కాజేశారనే అభియోగంపై కేసులు నమోదు చేసి జైలు పాలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు పోలీసులను ఉసిగొలిపి రాజన్న-సిరిసిల్ల జిల్లా రైతాంగాన్ని భయభ్రాంతులకు గురిచేసిన ఉదంతాలెన్నో ఎన్నో ఉన్నాయి. అలాగే తమ భూములకు పట్టాలు ఇవ్వాలని నిరుడు ఆగస్టు 20న మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన 36మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో 8 మంది మహిళా రైతులు ఉండటం గమనార్హం.
రంగారెడ్డి జిల్లాలో ఫార్మా భూముల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని కోర్టు స్టే ఉన్నా సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులపై గ్రీన్‌ఫార్మాసిటీ పోలీసులు నిరుడు ఏప్రిల్ 27న కేసులు నమో దు చేశారు. ఫార్మాసిటీ భూముల రీ సర్వేతోపాటు కంచె ఏర్పాటు పనులను టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు పోలీసుల నిర్బంధం మధ్య చేపట్టారు. తాటిపర్తిలోని సర్వే నెంబర్ 114లో ఫెన్సింగ్ వేసేందుకు వచ్చిన అధికారులను కోర్టు స్టే ఉన్న కారణంగా అడ్డుకున్న రైతులపై కేసులు నమోదు చేశారు.

జోగుళాంబ గద్వాల జిల్లాలో పోలీసులు రైతును కొట్టినట్టు చూపిస్తున్న ఎమ్మెల్యే విజయుడు
ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమని చెప్పిన పాపానికి రేవంత్ సర్కార్ లగచర్ల రైతుపై కత్తిగట్టి లగచర్ల సహా దాన్ని ఆనుకొని ఉన్న ఊళ్లను సైనిక స్థావరంగా మలచి అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన వైనం గుర్తుచేసుకుంటే ఇప్పటికీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఉలిక్కిపడుతుంది. అర్ధరాత్రి కరెంట్తీసి.. ఆఖరికి ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి రైతులను శత్రుదేశ కిరాయిమూకలుగా చిత్రించినవైనం తెలిసిందే. చివరకు గుండెనొప్పితో బాధపడుతున్న గిరిజన రైతు హీర్యానాయక్‌కు సంకెళ్లు వేసిన అమానవీయ ఘటన కండ్ల ముందే కదలాడుతున్నది. గ్రామాలను దిగ్బంధించి, స్థానికులను అరెస్టు చేసి కంపెనీలను ఎలా పెడుతారు? అని ప్రశ్నించిన పాపానికి, భూసేకరణ అనేది చట్ట పరిధిలో ప్రజల సమ్మతితో జరుగాలి. కానీ, బలవంతంగా గుంజుకోవాలనుకోవటం సరికాదు అని చెప్పినా సర్కార్ పెడచెవిన పెట్టి రైతు కాళ్ల కింద భూమిని కాజేయాలని చూసింది. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండలంలోని హకీంపేట, లగచర్ల, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీల ఏర్పాటుకు 1376 ఎకరాల భూసేకరణ చేపట్టింది. తమ భూములు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చిచెప్పిన రైతులపై కక్షగట్టి 71మంది రైతులపై కేసులు పెట్టారు. ఇందులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని ఇరికించి జైలుకు పంపింది. రైతులు 50రోజులు సంగారెడ్డి జైలులో ఉన్నారు. లగచర్ల సురేశ్ అత్యధికంగా 70 రోజులు జైల్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది.
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో కాళ్లాపూర్ రైతులు ఇండస్ట్రియల్ పార్కు భూములు ఇవ్వబోమని నిరుడు మార్చి 26న ధర్నా చేసినందుకు 10 మంది రైతులపై కేసు నమోదు చేశారు. అలాగే , ఏప్రిల్ 1న పరిగి మండలం రాపోల్ రైతులు రాస్తారోకో చేసిన 10మంది రైతులపై, ఏప్రిల్ 6న పరిగి పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు సంబంధించి కాళ్లాపూర్ రైతులు 10 మందిపై కేసు పెట్టారు.
ఇథనాల్ పరిశ్రమకు తమ భూములు ఇవ్వమని తెగేసి చెప్పటమే కాదు అసలా ఫ్యాక్టరీని తమ ప్రాంతంలో అనుమతించబోమని నిర్మల్, జోగుళాంబ-గద్వాల జిల్లాల రైతాంగం ఎడతెరపిలేని పోరాటం చేసింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్, జోగుళాంబ-గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్దధన్వాడ రైతులు అలుపెరుగని పోరాటం చేశారు. 2024లో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. నిర్మల్-బైంసా ప్రధాన రహదారిని దిగ్బంధించారని పోలీసులు మొత్తం 96మందిపై కేసులు నమోదు చేశారు. ఇక పెద్ద ధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ రైతులు శాంతియుత నిరసన దీక్షలు చేశారు. 2025 జూన్ 4న కంపెనీ యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తుల(బౌన్సర్లు)తో రైతులపై దాడి చేయించింది. ప్రైవేట్ గూండాలపై రైతులు తిరుగుబాటు చేసి దాడిని అడ్డుకున్నారు. ఇక్కడ కూడా 40మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
– నూర శ్రీనివాస్