NREGA | హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణలో నిర్వహించిన పనులకు బిల్లులు చెల్లించడంలో రాష్ట్ర ప్ర భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సైతం విడుదల చేయడం లేదు. దీనిపై ఆయా పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద గత 9 నెలల్లో దాదాపు రూ.1,000 కోట్ల విలువైన పనులను చేపట్టారు. ఇందుకు అయిన వ్య యంలో కేంద్ర ప్రభుత్వం 75%, రాష్ట్ర ప్రభుత్వం 25% భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం తన వాటా కింద గత నెలలోనే దాదాపు రూ.700 కోట్లు జమ చేసింది.
దీనికి రాష్ట్ర వాటాను కూడా కలిపి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నది. దీంతో ఇన్నాళ్లూ ఎన్నికల కోడ్ అంటూ సాకులు చెప్పిన రేవంత్రెడ్డి ప్రభుత్వం.. కోడ్ ముగిసి వారం రోజులు దాటినా ఆ బిల్లుల ఊసెత్తడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయకపోగా కనీసం కేంద్రం జమ చేసిన నిధులను కూడా విడుదల చేయడం లేదు. పైపెచ్చు ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లించినట్టు తెలుస్తున్నది. దీంతో దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తమ పరిస్థితి తయారైందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నదని మండిపడుతున్నారు. చివరకు కేం ద్రం ఇచ్చిన నిధులను కూడా విడుదల చేయకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ ఎన్నికల కోడ్ను సాకుగా చూపి తమను మభ్యపెట్టిన రేవంత్ సర్కారు ఇప్పటికైనా ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.