‘చల్ల పేరుకొనే ముందు కుండ పగులగొట్టడం’ మాదిరిగానే ఉన్నది ఇప్పుడు రేవంత్ సర్కార్ తీరు. ఉద్యమ నేత కేసీఆర్ అవిశ్రాంత పోరాటాలతో కృష్ణా నదీజలాల పునఃపంపిణీకి కేంద్రం సెక్షన్-3 ద్వారా మార్గదర్శకాలు జారీచేసింది. తద్వారా ఉమ్మడి రాష్ట్రంలో కోల్పోయిన జలహక్కులను సాధించుకొనేందుకు తెలంగాణకు మార్గం సుగమమైంది. వాదనలు తుదిదశకు చేరుకొన్నాయి. రాబోయే కొద్దిరోజుల్లో న్యాయమైబద్ధమైన వాటా మనకు దక్కే అవకాశం మెండుగా ఉన్నది. ఇలాంటి సమయంలో ఏపీ మరోనాటకానికి తెరతీసింది. ఒప్పందాలు, చర్చలు అంటూ కొత్తరాగం అందుకొన్నది. నదీజలాల దోపిడీ కోసం కొత్త ప్రాజెక్టులకు పూనుకొంటున్నది. అలాంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పుడు అందుకు భిన్నంగా వాటికే వత్తాసు పలుకుతున్నది. చర్చలకు సాగిలపడుతూ, చట్టబద్ధం కాని ఒప్పందాలకు తెగబడుతూ తెలంగాణ హక్కులకు శాశ్వత సమాధి కడుతున్నది.
హైదరాబాద్, జూన్27 (నమస్తే తెలంగాణ): తెలంగాణను బలవంతంగా ఏపీతో విలీ నం చేసి, ఒప్పందాలన్నింటినీ అటకెక్కించి, హైదరాబాద్ స్టేట్ ప్రాజెక్టులను ఖతం పట్టించింది నాటి కాంగ్రెస్ పాలకులే. ట్రిబ్యునళ్ల ఎదుట జలహక్కుల వాదనలు వినిపించే అవకాశమే లేకుండా చేసిందీ ఆ పాలకులే. సుదీర్ఘ పోరాటం తర్వాత తప్పని పరిస్థితుల్లో ప్రత్యేక తెలంగాణను ఇస్తూ కాంగ్రెస్ మళ్లీ కుట్రకు తెరతీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 రూపంలో తెలంగాణకు తీరని విద్రోహాన్ని తలపెట్టిందీ అదే కాంగ్రెస్. వాస్తవంగా నదీ పరీవాహక ప్రాంత విస్తీర్ణం, భౌగోళిక, వాతావరణం తదితర అంశాల ప్రాతిపదికన రాష్ర్టాలకు ఆయా నదీజలాల్లో నీటి వాటా ను కేటాయిస్తారు.
అంతర్జాతీయ జలసూత్రా లు కూడా అవే అంశాలను ప్రాతిపదికగా నీటి పంపిణీ చేపట్టాలని నిర్దేశిస్తున్నాయి. అయినా నాటి యూపీఏ సర్కార్ అందుకు విరుద్ధంగా ఏపీ పునర్విభజన చట్టం-2014ను రూపొందించింది. జలాలను పునఃపంపిణీ చేయాలని ఎక్కడా నిర్దేశించలేదు. అందుకు పూర్తి విరుద్ధంగా చట్టంలో సెక్షన్-89 నిబంధనను పొం దుపరచింది. దాని ప్రకారం కేవలం అప్పటికే ఆయా రాష్ర్టాలు వినియోగంలో ఉన్న నదీజలాలను మాత్రమే ప్రాజెక్టుల వారీగా పంపిణీ చే యాలని నిర్దేశించింది. అప్పటికే కొనసాగుతున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కే ఆ బాధ్యత లు అప్పగించింది.
అంతేకాదు సాగునీటి ప్రాజెక్టుల అంశం రాష్ట్ర జాబితాలో ఉండగా, దానిని కేంద్రానికి తాకట్టు పెట్టింది. బోర్డులు ఏర్పాటుచేసి, ప్రాజెక్టులు నిర్వహించాలని నిర్దేశించింది. సెక్షన్-89 ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు న్యాయమైన నీటిపంపకాలు చేసే అధికారం తమకు లేవని కృష్ణాజలాల వివాదాల ట్రిబ్యునల్-2 చైర్మన్ బ్రిజేశ్‌కుమార్ సైతం తేల్చిచెప్పారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణకు కాంగ్రెస్ తలపెట్టిన విద్రోహం ఎలాంటిదో వీటినిబట్టే అర్థం చేసుకోవచ్చు.
సెక్షన్-89 ప్రకారం నదీజలాల పంపిణీ చేపడితే తెలంగాణకు ఒరిగేదేమీ ఉండబోదని, నీళ్ల వాటా ఆకాంక్ష నెరవేరబోదని ఆదిలోనే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గుర్తించారు. పరీవాహక ప్రాంతం ఆధారంగా నీటివాటాలు తేల్చాలనే డిమాండ్‌ను ముందుంచారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 45 రోజుల్లోనే సీఎం హోదాలో కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం1956లో సెక్షన్-3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి న్యా యమైన నీటి వాటా తేల్చాలని వినతిపత్రం అందజేశారు. అయినా కేంద్రం కాలయాపన చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
2020లో జరిగిన 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ట్రిబ్యునల్ అంశంపై కేసీఆర్ ప ట్టుబట్టారు. తుదకు కేంద్రం ఎట్టకేలకు ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించింది. అయినా మళ్లీ కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలా? లేదంటే ప్రస్తుతమున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కే సెక్షన్-3 ప్రకారం నీటి వాటాలు పంపి ణీ చేసే అధికారాలు కల్పించాలా? అనేదానిపై న్యాయశాఖ సలహా తీసుకోవాలని మెలిక పెట్టింది. సుప్రీంకోర్టులో వేసిన కేసు తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ఆ తర్వాతే న్యాయసలహా కోరుతామని షరతు పెట్టింది.
కేంద్రం సూచనల మేరకు కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపసంహరించుకొన్నది. తుదకు 2023 సెప్టెంబర్‌లో సెక్షన్-3 ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్యనే కృష్ణా జలా లు పునఃపంపిణీ చేయాలని కృష్ణా జల వివాద ట్రిబ్యునల్-2కి నూతన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌ను (టీవోఆర్) జారీచేసింది. కేసీఆర్ అవిశ్రాంత కృషితో దశాబ్దాల అనంతరం తెలంగాణకు జలహక్కులపై వాదనలకు వినిపించే అపూర్వ అవకాశం లభించింది. ఇప్పటికే తె లంగాణ తరఫున వాదనలు వినిపించింది.
ఉమ్మడి ఏపీకి కృష్ణాజలాల్లో ట్రిబ్యునల్1, ట్రిబ్యునల్2 కేటాయించిన 1,005 టీఎంసీలతోపాటు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలు మొత్తంగా 1,050 టీఎంసీల్లో 68 శాతం క్యాచ్మెంట్ ఏరియా, బేసిన్లో నివసించే జనాభా, దుర్భిక్ష ప్రాంతాల ప్రామాణికంగా తెలంగాణకు 789 టీఎంసీల వాటా దక్కుతుందని ప్రతిపాదనలు ముందు పెట్టిం ది. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 238 టీంఎసీలు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు 216 టీఎంసీలు కేటాయించాలని స హేతుకమైన వాదనలు వినిపించింది. ప్రస్తు తం ఏపీ వాదనలు సైతం తుదిదశకు చేరుకొన్నాయి. రాబోయే కొద్దిరోజుల్లోనే తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేందుకు మెండు గా అవకాశాలున్నాయి.
ఇప్పుడు ఏపీ కొత్త కుట్రలకు తెరలేపింది. శ్రీశైలం ప్రాజెక్టుకు జలాలు రాకముందే ఎగువనే తుంగభద్రను చెరబట్టేందుకు ఒకవైపు గుండ్రేవుల రిజర్వాయర్ పనులకు శరవేగంగా అడుగులు వేస్తున్నది. మరోవైపు కర్ణాటకతో కలిసి తుంగభద్ర డ్యామ్ హైలెవల్ కెనాల్‌కు సమాంతరంగా 189 కి.మీ పొడవుతో మరో వరద కాలువను తవ్వేందుకు ప్రణాళికలు రూ పొందించి ముందుకు సాగుతున్నది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దిగువన ఆయకట్టుకు గోదావరి జలాలను మళ్లించేందుకు పోలవరం-బనకచర్ల (నల్లమలసాగర్)ను తెరమీదికి తెచ్చి, ఆమోదం కోసం యత్నించి విఫలమై గోదావరి-కావేరి లింకు పేరిట ముందుకొస్తున్నది. కేంద్రాన్ని ముందుపెట్టి తన జల ప్రణాళికలు, ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు కుటిల యత్నాలకు పాల్పడుతున్నది.
ఏపీ కుట్రలకు మద్దతుగా నిలుస్తున్న కేంద్రం తీరును వ్యతిరేకించాల్సిన, దీటుగా బదులివ్వాల్సిన రేవంత్ సర్కార్.. అందుకు భిన్నంగా దాసోహమనడమే ఇప్పుడు తెలంగాణ నీటిరంగ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నది. నోటితో నవ్వుతూ, నొసటితో వెక్కిరించిన చందంగా వ్యవహరిస్తున్న ఏపీతో చర్చలకు ఉరుకలేస్తూ తెలంగాణకు శాశ్వత మరణశాసనం రాస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
రాష్ర్టాలు చేసుకొనే ఒప్పందాలకు చట్టబద్ధమైన విలువకానీ, ఉల్లంఘిస్తే చేసేదేమీ కూడా ఉండబోదని నీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్)నే ప్రధానంగా ఉదహరిస్తున్నారు. వాస్తవంగా 1944లో అప్పటి మద్రాస్ ప్రభుత్వం (ఆంధ్ర అందులో భాగం), హైదరాబాద్ రాష్ట్రం చేసుకొన్న ఒప్పందాల ఫలితంగా సుంకేసులకు ఎగువన ఆర్డీఎస్ పురుడుపోసుకొన్నది. ఆ ఒప్పందం ప్రకారం కేసీ కెనాల్, ఆర్డీఎస్ కాలువ సరిసమానంగా తుంగభద్ర జలాలను వినియోగించుకోవాల్సి ఉంటుం ది.
మద్రాస్ నుంచి 1953లో ‘ఆంధ్ర’ రాష్ట్ర ఏర్పడటం, ఆ తర్వాత 1956లో కుట్రపూరితంగా తెలంగాణను కలుపుకొని ‘ఆంధ్రప్రదేశ్’గా అవతరించింది. 1944 ఒప్పందం ప్రకారం ఆర్డీఎస్ కెనాల్‌కు, కేసీ కెనాల్‌కు సమానంగా నీటిని కేటాయించాల్సిన ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే ఆ ఒప్పందాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని బచావత్ ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపించింది. కేసీ కెనాల్‌కు 69.4 టీఎంసీలు డిమాండ్ పెట్టగా, ఆర్డీఎస్ కెనాల్‌కు కేవలం 15.9 టీఎంసీలు మాత్రమే కావాలని డిమాండ్ చేసింది.
వాదనలు విన్న ట్రిబ్యునల్ కెసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలు, ఆర్డీఎస్కు 15.9 టీఎంసీలు కేటాయించింది. ఫలితంగా 1944 ఒప్పందమనేది లేకుండా పోయింది. నాడు హైదరాబాద్ స్టేట్, మద్రాస్, మైసురు రాష్ర్టాలు చేసుకొన్న ఒప్పందాలన్నింటినీ ఉమ్మడి ఏపీ పాలకులే అటకెక్కించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. నేడు మరోసారి ఒప్పందాల పేరిట బురిడీ కొట్టించేందుకు ముందుకు వస్తుండగా, వాటికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వత్తాసు పలుకుతున్నారు.