కొడంగల్, నవంబర్ 11 : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో లగచర్ల ఘటన జరిగి మంగళవారం నాటికి ఏడాది పూర్తయినందున బాధిత రైతులు చీకటి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మొదట్ల్లో ఫార్మా కంపెనీలు అంటూ ఆ తరువాత ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ప్రభుత్వం తమ భూములను స్వాధీనం చేసుకున్నదని పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం పేద రైతుల నుంచి భూములు లాక్కోవడమే కాకుండా ప్రభుత్వ కక్షగట్టి 72 మందిపై కేసులు పెట్టి జైలుపాలు చేసినందున బ్లాక్‌డేగా పాటిస్తున్నట్టు తెలిపారు. దుద్యాల మండలంలోని హకీంపేట, లగచర్ల, పులిచెర్లకుంట తండా, రోటిబండతండా, పోలెపల్లికి చెందిన రైతులు అధికారులపై దాడికి పాల్పడ్డారంటూ అక్రమ కేసులుపెట్టి జైల్లో వేయడం బాధాకరమని అన్నారు. ఆ సమయంలో తనపై దాడి జరగలేదని, అసలు దాడి అనే పదాన్ని కూడా వాడకూడదని స్వయాన అప్పటి కలెక్టర్ పేర్కొన్నప్పటికీ ప్రభుత్వం రైతులపై కక్షగట్టి నేరారోపణలతో మహిళా రైతులను సైతం పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పిందని, ఈ అరాచకాన్ని గుర్తుచేసుకుంటూ మంగళవారం చీకటి దినోత్సవాన్ని జరుపుకొన్నట్టు వారు పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) డిమా ండ్ చేసింది. ఏఐవైఎఫ్ రాష్ట్ర కమి టీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలిఉల్లా ఖా ద్రీ, కార్యద ర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ దేశానికి భద్రత కల్పించడంలో అమిత్ షా తన పాత్రను మరిచి బీహార్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. పేలుడులో మరణించిన వారికి రూ. కోటి, గాయపడిన వారికి రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.