హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేసిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar ) ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీల రిజర్వేషన్( BC Resevation) జీఓ ద్వారా సాధ్యం కాదని, రాజ్యాంగ సవరణ జరిగితేనే ఫలితం ఉంటుందని ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టంగా చెప్పామని పేర్కొన్నారు. ఈ విషయంలో తమిళనాడు వెళ్లి కూడా అధ్యయనం చేసి వచ్చి వివరించామన్నారు.
బీసీలను అవమానం చేసేలా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. జీఓ న్యాయస్థానంలో నిలబడదని సీఎం, మంత్రులు, అందరికీ తెలుసని అన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపాల్సిందేనని డిమాండ్ చేశారు.బీహార్, మహారాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు చేయవద్దని కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాకే బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్న రేవంత్ రెడ్డి జీవో ఎందుకు ఇచ్చారు? 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పిస్తామని జీఓ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. బీసీలు ఏం చేస్తారు లే అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లని జీవో ఇచ్చిందని ఆరోపించారు.
1992లో తమిళనాడు సీఎం జయలలిత, ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ల కోసం భీష్మించి కూర్చోవడంతో కేంద్రం దిగివచ్చి రాజ్యాంగ సవరణ చేయడం వల్ల తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లు పెరిగాయని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ల కోసం రేపే ఢిల్లీ వెళ్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది హెచ్చరించారు.ఎన్నికలకు తొందర లేదు, రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించిన తర్వాతే నిర్వహించాలన్నారు.చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి కదలాలని, రిజర్వేషన్ల అంశం తేలే వరకు హైదరాబాద్ రావద్దని సూచించారు. 56 సార్లు సొంత పనుల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం బీసీల కోసం ఒక్కసారి ఢిల్లీ వెళ్లి పోరాడాలని సూచించారు.
పదవులు కాపాడుకునేందుకే స్టంట్లు : మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
రాహుల్ గాంధీని ఖుషీ చేసేందుకు, పదవులు కాపాడుకునేందుకు కాంగ్రెస్ నేతలు స్టంట్ చేస్తున్నారని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్( Srinivas Goud) విమర్శించారు.రాష్ట్రపతిని కలవకుండానే ఢిల్లీలో ధర్నా చేసి హంగామా చేశారని ఆరోపించారు.చట్టం ప్రక్రియ పూర్తి కాకముందే జీవోఎలా తెస్తారని ప్రశ్నించారు.బీహార్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.రాహుల్ గాంధీ కోసం తెలంగాణలో బీసీలను బలి పెట్టి రోడ్లపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.స్టే వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తూ వచ్చారు.హైకోర్టులో కేసు వేసింది కాంగ్రెస్ నేతలేనని పేర్కొన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ఆపరేషన్ సక్సెస్… పేషెంట్ డెడ్ అనేలా కాంగ్రెస్ వ్యవహరించిందని రవిచంద్ర, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం బీసీ రిజర్వేషన్లను ఉపయోగించుకుందని విమర్షించారు. అమలు కాదని తెలిసి కూడా మోసపూరిత జీవో తీసుకొచ్చి ఆగం చేశారని మండిపడ్డారు. బీసీల ఆగ్రహ జ్వాలలో కాంగ్రెస్ కూలిపోవడం ఖాయమని పేర్కొన్నారు. బీసీల నోట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన్ను కొట్టిందని,అంబేద్కర్ రాజ్యాంగం తమకు పట్టదు అన్నట్లుగా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని అన్నారు.