హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కారు బడ్జెట్లో పేర్కొన్న రుణ సమీకరణ లక్ష్యానికి చేరువైంది. ఆర్థిక సంవత్సరం సగం కూడా పూర్తికాకముందే సుమారు 90 శాతం అప్పు తీసుకున్నది. శుక్రవారం మరో రూ.5000 కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. ఆర్బీఐ ప్రతి మంగళవారం నిర్వహించే ఈ-వేలంలో పాల్గొని సెప్టెంబర్ 23న ఈ మొత్తాన్ని సేకరిస్తామని పేర్కొన్నది. 22 ఏండ్ల కాలానికి రూ.1,500 కోట్లు, 23 ఏండ్ల కాలానికి రూ.1000 కోట్లు, 24 ఏండ్ల కాలానికి రూ.1000 కోట్లు, 26 ఏండ్ల కాలానికి రూ.1500 కోట్ల రుణ సమీకరణ కోసం సెక్యూరిటీ బాండ్లు పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల కింద రూ.54,009 కోట్లు సమీకరిస్తామని కాంగ్రెస్ సర్కారు బడ్జెట్లో ప్రతిపాదించింది. కానీ, ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు కూడా గడువక ముందే ఒక్క ఆర్బీఐ నుంచే ఈ నెల 16వ తేదీ నాటికి రూ.41,900 కోట్ల అప్పు చేసింది. మంగళవారం తీసుకోబోయే అప్పుతో రుణసమీకరణ రూ.46,900 కోట్లకు చేరనుంది. బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఓపెన్ మార్కెట్లో సేకరించాల్సిన అప్పు ఇంకా రూ.7 వేల కోట్లు మాత్రమే మిగిలింది. కాంగ్రెస్ సర్కారు ఆదాయ రాబడిలో 35 శాతం దాటడం లేదు.. కానీ, అప్పుల సేకరణలో మాత్రం 87 శాతానికి చేరడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.