భోగిమంటల్లో ‘జాబ్ క్యాలెండర్’
జాబ్ క్యాలెండర్ పేరిట దగా చేసిన రేవంత్ ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం చల్లారడం లేదు. ప్రశ్నించినవారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న సర్కార్ తీరుపై యువత తీవ్రస్థాయిలో మండిపడుతున్నది. మంగళవారం సాయంత్రం అశోక్‌నగర్‌లో చేపట్టిన నిరసనలో కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రతులను, డమ్మీ జాబ్ క్యాలెండర్లను భోగిమంటల్లో వేస్తున్న నిరుద్యోగులు.
హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల పునర్విభజన కారణంగా మరో రెండేండ్లపాటు ఉద్యోగాల భర్తీపై ఆశలు వదలుకోవాల్సిందేనని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాలకు ఎగనామం పెట్టేందుకు, ఉద్యోగాలు భర్తీచేయకుండా తప్పించుకునేందుకే జిల్లాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శిస్తున్నారు. రెండేండ్లు ఉద్యోగాలు భర్తీచేయకుండా అనేక అంశాలు, సాకులు తెరపైకి తెచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు జిల్లాల పునర్విభజన వ్యవహారాన్ని ముందుకు తెచ్చిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాకులు వెతకడం, కమిటీలు వేయడం.. సాగదీయడం కాంగ్రెస్ సర్కార్‌కు అలవాటుగా మారిందని విమర్శిస్తున్నారు. జిల్లాల పునర్విభజన కమిషన్‌కు నివేదిక సమర్పించేందుకు ఆరు నెలల గడువు ఇస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. నివేదిక వచ్చాక, జిల్లాలతోపాటు జోనల్ విధానం కూడా మారుతుందని, మొత్తం ప్రక్రియ ముగిసేందుకు రెండేండ్లు పడుతుందని నిరుద్యోగులంటున్నారు. రాబోయే రెండేండ్లపాటు ఉద్యోగాలు భర్తీ చేయకుండా తప్పించుకునే కుట్రలో ఇది భాగమని మండిపడుతున్నారు.
కాంగ్రెస్ సర్కార్ కొలువు దీరిన తరువాత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం తీవ్ర ఒత్తిడి పెరిగింది. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడంటూ యువత సోషల్ మీడియాలో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో 503 పోస్టుల భర్తీకి కేసీఆర్ సర్కార్ జారీచేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దుచేసి, మరో 60 పోస్టులు కలిపి 563 పోస్టులతో కాంగ్రెస్ సర్కార్ కొత్త నోటిఫికేషన్ జారీచేసింది. 25 వేల టీచర్ పోస్టులను భర్తీచేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. చివరకు కేసీఆర్ సర్కార్ 5,089 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దుచేసి, మరో ఆరువేల పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ జారీచేసింది. ఆ తర్వాత 2024 ఆగస్టు 2న అసెంబ్లీలో 20 రకాల నోటిఫికేషన్లతో జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. 2024 అక్టోబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఈ 20 రకాల ఉద్యోగాలను భర్తీచేస్తామని పేర్కొన్నది. ఇప్పటివరకు 20 నోటిఫికేషన్లలో ఒక్కటి కూడా విడుదలకాలేదు.
2024 అక్టోబర్‌లో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు రిటైర్డ్ హైకోర్టు జడ్డి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఉప కులాల వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్‌పడింది. మరోవైపు, కుల గణన అంశాన్ని తెరపైకి తెచ్చిన సర్కార్.. నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు కుల గణన సర్వే నిర్వహించింది. కుల గణన పూర్తయిన తరువాత కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదు.
2025 ఏప్రిల్‌లో టీజీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల సిలబస్‌ను సమూలంగా మార్చే కసరత్తు చేపట్టింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షల సిలబస్‌ను మారుస్తామని ప్రకటించింది. ఇంతవరకు ఈ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. సిలబస్‌పై తేల్చలేదు. కొంతకాలానికి గ్రూప్-3 పరీక్షను రద్దుచేసి, గ్రూప్-4లో విలీనం చేసే అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో దుమారం చెలరేగింది.
ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల లెక్కలు, ఖాళీల వివరాలు తేల్చేందుకు సర్కార్ ఓ కమిటీని నియమించింది. మాజీ సీఎస్ శాంతికుమారి, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, పీఆర్సీ కమిటీ చైర్పర్సన్ శివశంకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సరైన సమాచారం అందకపోవడంతో గడువు ముగిసినా నివేదిక రాలేదు.
ఇప్పుడు కొత్తగా జిల్లాలు.. మండలాల పునర్వవస్థీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో పాత జోనల్ విధానం రద్దవుతుంది. మళ్లీ కొత్త జోనల్ విధానం రూపొందించాలి. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలి. అక్కడినుంచి రాష్ట్రపతికి చేరాలి. రాష్ట్రపతి ఆమోద ముద్రవేయాలి. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగితే కనీసం రెండేండ్లు పడుతుందని అంచనా. గతంలో కొత్త జోనల్ విధానానికి ఆమోదం తెలిపేందుకు రెండేండ్లు పట్టింది. ఒకవేళ ఆమోదం తెలుపకపోతే మళ్లీ కథ మొదటికొస్తుంది. ఈ మధ్యలో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే అంతే సంగతి.
నిన్న మొన్నటివరకు త్వరలో, అతి త్వరలో నోటిఫికేషన్ల జాతర అంటూ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. 35 వేల నుంచి 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతాయంటూ ఆశలు కల్పించారు. పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ పేరుతో ఊరించగా, అది పత్తాలేకుండా పోయింది. ఆరువేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రెండేండ్లు గడిచినా ఈ నోటిఫికేషన్ జాడలేదు. 17వేల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ రెడీగా ఉన్నదని, 2026 మార్చిలోపు నోటిఫికేషన్లు ఇస్తామని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా పలువురు నేతలు ప్రకటనలు గుప్పించారు. కానీ, నోటిఫికేషన్లు మాత్రం రావడంలేదు.
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో వివిధ కారణాలతో కాలయాపన చేయడం ఒక వంతు కాగా, ఎన్నికల కోడ్ పేరుతో మరికొంత కాలం కాలయాపన చేస్తున్నదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 2024 ఏప్రిల్‌లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. జూన్ వరకు ఎన్నికల కోడ్ ఉండటంతో ఈ పేరుతో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా సర్కార్ తప్పించుకోగలిగింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో రెండు నెలలు గడిపింది. ఆ తర్వాత వెంటనే డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. ఈ విధంగా వరుసగా ఎన్నికల కోడ్ల పేరుతో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా సర్కార్ తమను అలక్ష్యం చేస్తున్నదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమంటూ శాసనమండలి సాక్షిగా మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. మంత్రి చేసిన ఈ ఒక్క ప్రకటన నిప్పురాజేసింది. కొలువుల కోసం నిరుద్యోగులు పోరుబాట పట్టారు. నాలుగు రోజుల వ్యవధిలో దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు రెండుసార్లు రోడ్డెక్కారు. అశోక్‌నగర్, చిక్కపడల్లి ప్రాంతాలు నిరుద్యోగుల ఆందోళనలు, పోలీసుల మోహరింపులతో యుద్ధభూమిని తలపిస్తున్నాయి. నిరుద్యోగుల ఆందోళనతో కొన్ని రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ దద్దరిల్లింది. చిక్కడపల్లి సిటీసెంట్రల్ లైబ్రరీలో నిరంతరం నిరుద్యోగుల సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాలు ధర్నాలు, నిరసనలు అధికమయ్యాయి. దీంతో ఈ లైబ్రరీలో సభలు, సమావేశాలు నిర్వహించవద్దని సర్కార్ పెద్దలు సర్క్యులర్ జారీచేశారు.