హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో భారీ బహిరంగసభ నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం మొదలైంది. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే సభలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్నారు. రైతుభరోసా పంపిణీ చేయకపోవడంపై కచ్చితంగా కేసీఆర్ ఈ సభ సాక్షిగా ప్రశ్నిస్తారని, రైతుల తరఫున నిలదీస్తారని రేవంత్ సర్కార్‌కు అవగతమైంది. దీంతో నిన్నమొన్నటి దాకా నిధులే లేవంటూ రైతుభరోసా రెండో విడతను వాయిదావేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కేసీఆర్ సభ రోజే పంపిణీ చేయాలని నిర్ణయించింది. జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించే బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిధులు విడుదల చేస్తారని అధికారులు ప్రకటించారు. మొత్తం 45.11 లక్షల మంది రైతులకు రూ.2,063 కోట్లు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎన్ని ఎకరాల వరకు రైతుభరోసా నిధులు జమ చేస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వడం లేదు.
ఒక్కసారిగా సమకూరిన నిధులు
ప్రభుత్వం మార్చి 22న రైతుభరోసా తొలి విడత నిధులు పంపిణీ చేసింది. 20 రోజుల్లో రెండోవిడత అందజేస్తామని ప్రకటించింది. ఇప్పటికి 28 రోజులవుతున్నా ఆ ఊసేలేదు. వాస్తవానికి ఈ నెల 14న పంపిణీ చేయాలని భావించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిధులు సమకూరకపోవటంతో మరికొన్ని రోజులు వాయిదా వేయాలని నిర్ణయించినట్టు వెల్లడించాయి. అనుకోని విధంగా కేసీఆర్ జగిత్యాలలో భారీ సభ నిర్వహిస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డట్టు తెలిసింది. ఎలాగైనా నిధులు సమకూర్చాలని ఆర్థికశాఖకు ఆదేశాలు అందినట్టు చెప్పుకొంటున్నారు. తొలి విడతలో కొందరికి రాకపోగా, మరికొందరికి ఒకటి కంటే ఎక్కువ విస్తీర్ణానికి నిధులు జమైనట్టు ఆరోపణలు వచ్చాయి. రెండో విడతలో ఎన్ని ఎకరాలకు పంపిణీ చేస్తున్నదో సర్కార్ చెప్పడమే లేదు. 45.11 లక్షల మంది రైతులకు రూ.2,063 కోట్లు పంపిణీ చేస్తున్నట్టు మాత్రమే ప్రకటించింది.