Paddy Procurement | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : ఈ యాసంగిలో రైతులు పండించిన ధాన్యంలో సగం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయనున్నది. మిగతా సగం ఏం చేసుకుంటరో? ఎవరికి అమ్ముకుంటరో? అది రైతుల ఇష్టం. ఈ మేరకు యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సివిల్ సప్లయ్ మార్గదర్శకాలను జారీచేసింది. ఈ సీజన్లో 137.10 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 70.13 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది. అంటే రైతులు పండించిన ధాన్యంలో సగం మాత్రమే కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు ప్రకటించింది.
వాస్తవానికి వానకాలంతో పోల్చితే యాసంగిలో ధాన్యం దిగుబడి అధికంగా ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ యాసంగిలో వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం 56.95 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఈ లెక్కన సుమారు 150 లక్షల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సివిల్ సైప్లె మాత్రం దీన్ని తగ్గించి 137 లక్షల టన్నులకే ఉత్పత్తిని పరిమితం చేసింది. ఇందులోనూ మరింత తగ్గించి కొనుగోలు లక్ష్యాన్ని 70 లక్షలకే పరిమితం చేయడం గమనార్హం. ఈ లెక్కన సర్కారు లెక్కల ప్రకారమే 67 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు ఏ విధంగా, ఎక్కడ అమ్ముకోవాలనేది ప్రశ్నార్థకంగా మారింది.
గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాలను అకాల వర్షం ఆగం చేసింది. పొలాల్లో ఉన్న పంటలు నేలవాలగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి తోటలు, మక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మైలారంలో ధాన్యం కుప్పల్లో నిలిచిని నీటిని తొలగిస్తున్న రైతులు.
యాసంగి ధాన్యం ఉత్పత్తిలో సగం మాత్రమే కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న సివిల్ సప్లయ్ ఆ మేరకు తెరవెనుక పావులు కదుపుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లపై కావాలనే జాప్యం చేస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ధాన్యం దిగుబడులు ఆరంభమైనా, కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తున్నదనే విమర్శలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 8,218 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సివిల్ సప్లయ్ నిర్ణయించింది. ఇప్పటివరకు 127 కేంద్రాలనే ప్రారంభించింది. ఇప్పటికే నిజామాబాద్, నల్లగొండ, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో వరి కోతలు మొదలయ్యాయి. రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారు. గత సీజన్లోనూ కోటి టన్నుల ధాన్యం దిగుబడి లక్ష్యంగా పెట్టుకున్న సివిల్ సప్లయ్.. 50 లక్షల టన్నులే కొనుగోలు చేసి చేతులు దులిపేసుకున్నదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా సగం ధాన్యమే కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నదని రైతులు, రైతు ప్రతినిధులు భగ్గుమంటున్నారు.