హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ‘రాష్ర్టానికి కావాల్సిన నిధులు, రావాల్సిన అనుమతుల కోసం ప్రధాని, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి అడగడం సీఎంగా నా బాధ్యత. తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్కసారి కాదు వెయ్యి సార్లయినా ఢిల్లీకి వెళ్తా. కేంద్రంతో కొట్లాడయినా నిధులు తెస్తా. నిధుల వేటలో రాజీ పడ ను’ ఇదీ సీఎం రేవంత్ పలికిన ప్రగల్భాలు. అలా ఇప్పటివరకు 67సార్లు హస్తినకు వెళ్లిన సీఎం.. బుధవారం మరోసారి ఢిల్లీ విమానం ఎక్కారు.
ఢిల్లీ గడప తొక్కి ప్రధానిని పెద్దన్న (బడే భాయ్)గా అభివర్ణిస్తూ మోదీని కాకాపట్టేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా కేంద్రం మాత్రం రేవంత్‌ను నమ్మడం లేదు. తెలంగాణకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ నిధులు సరిగా ఇవ్వడం లేదు. గతంలో కేంద్రంతో అనేక అంశాలపై కొట్లాడిన కేసీఆరే అత్యధికంగా రూ.6,955.80 కోట్ల నిధు లు తీసుకొచ్చారు. రెండేండ్లలో రేవంత్ రూ.6 వేల కోట్లకు మించి నిధులు తీసుకురాలేకపోయారు.
దక్షిణ భారత్‌లోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణకే అత్యంత తకువగా నిధులివ్వడం ద్వారా చోటేభాయ్ రేవంత్‌కు బడేభాయ్ మోదీ ఝలక్ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కొట్లాడకుండా ‘సఖ్యత’ పేరుతో రేవంత్ రెండు నాల్కల ధోరణి కొనసాగిస్తుండటమే తెలంగాణకు శాపంగా మారిందని కేటాయింపులే నిరూపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక కంటే తెలంగాణకు కేంద్రం తక్కువే కేటాయించడం రేవంత్ అసమర్థతకు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మూడేండ్ల్లలో కేంద్రం నుంచి తెలంగాణకు రావల్సిన గ్రాంట్-ఇన్-ఎయిడ్ నిధుల్లో మోదీ సర్కార్ భారీగా కోత విధించింది. 2023-24లో రూ.41,259 కోట్లు వస్తాయని రాష్ట్రం ఆశిస్తే రూ.6,955.80 కోట్లు మాత్రమే విదిల్చిం ది. గతంలో కేసీఆర్ అనేక అంశాల్లో కేంద్రంతో విభేదించారన్న కక్షతో తె లంగాణకు మోదీ తక్కువగా నిధులిచ్చారు. కానీ రేవంత్ కేంద్రంతో సఖ్యంగానే మెలుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయినా కేంద్రం నుంచి కేసీఆర్ తెచ్చినన్నీ నిధులు తేలేకపోయారు. గత ఆర్థిక సంవత్సరంలో 6,140 కోట్లు మాత్రమే రాబట్టగలిగారు. ఏపీ రూ.14,737 కోట్లు సాధించుకోగా.. తెలంగాణకు అందులో సగం కూడా దక్కలేదు.
సీఎం రేవంత్‌రెడ్డి నెలలో సగం రోజులు ఢిల్లీలోనే గడుపుతున్నారు. కేంద్రమంత్రులను కలిసి ఫొటోలకు పోజులివ్వడమే తప్ప రాష్ట్రానికి రా వాల్సిన ఒక పైసాను కూడా సాధించలేకపోతున్నారు. ఒకవైపు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ ముందు బీజేపీని తిడుతూనే మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ‘డబుల్ గేమ్’ ఆడుతుండటం వల్లే తెలంగాణకు నిధులివ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక ప్యాకేజీల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి వేల కోట్లు రాబట్టుకుంటుంటే.. రేవంత్ ఖాళీ చేతులతో ఢిల్లీ నుంచి వస్తున్నారు. రాష్ట్రం కంటే రాజకీయ ప్ర యోజనాలకే ప్రాధాన్యమిస్తున్న రేవంత్ తీరుపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
