హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి శిక్ష పడటం ఖాయమని, జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండాలని, ఈ దశలో సీఎం పదవికి ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అందుకే కోర్టు విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నట్టు కనిపిస్తున్నదని తెలిపారు. రాజీనామా చేయకుంటే సీఎం పదవిలో ఉండి జైలుపాలయితే ఆ కుర్చీకి చెడ్డపేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. రూ.50 లక్షల బ్యాగుతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి కూడా.. ఇన్ని రోజులు బుకాయించారని ఆరోపించారు.
దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఈడీ కూడా చెప్తున్నదని తెలిపారు. ఈ కేసులో సీఎం రేవంత్‌రెడ్డే కీలక నిందితుడని, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కూడా చార్జిషీట్లో పేరొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇదే కేసులో నిందితుడైన మత్తయ్య కూడా అదే విషయం చెప్పారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్తేనే తాను స్టీఫెన్‌సన్‌తో బేరం మాట్లాడానని మత్తయ్య కూడా చెప్తున్నట్టు తెలిపారు. దీన్నిబట్టి కూడా ఆయన తప్పు చేసినట్టుగా రుజువైందని పేర్కొన్నారు. లికర్ పాలసీ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా.. కేవలం ఆరోపణలు వస్తేనే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి కేజ్రీవాల్ తప్పుకున్నారని గుర్తుచేశారు. అలాంటిది రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా రూ.50 లక్షలతో దొరికిన వీడియోలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయని పేర్కొన్నారు.