Revanth Reddy | హైదరాబాద్/సంగారెడ్డి, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. చివరి దశ అభ్యర్థుల ఎంపికలో ఆయన సూచించిన అభ్యర్థులను పక్కనపెట్టి ఇతర నేతలకు టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో రేవంత్ మాట చెల్లుబాటు కాలేదని, సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నారనే టాక్ వినిపిస్తున్నది.
తుంగతుర్తిలో అద్దంకి దయాకర్‌కు, సూర్యాపేటలో పటేల్ రమేశ్‌రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు రేవంత్ ప్రయత్నించగా.. అధిష్ఠానం మాత్రం తుంగతుర్తిలో మందుల సామేల్‌కు, సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్‌డ్డికి టికెట్ కేటాయించింది. సామేల్‌కు కోమటిరెడ్డి, దామోదర్‌రెడ్డికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మద్దతిచ్చినట్టు తెలిసింది. ఈ రెండు స్థానాల విషయంలో కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్ తొలి నుంచీ పట్టుదలగా ఉన్నారు. ఈ సీట్లలో తాము సూచించిన వారికి కాకుండా రేవంత్ వర్గీయులకు టికెట్లు ఇస్తే సహించేది లేదని, తాము కూడా పోటీ నుంచి తప్పుకుంటామని అధిష్ఠానాన్ని హెచ్చరించినట్టు సమాచారం. దీంతోపాటు నారాయణఖేడ్ విషయంలోనూ రేవంత్‌కు అధిష్ఠానం చెక్ పెట్టింది. తొలుత రేవంత్ వర్గంగా పేరొందిన సురేశ్షేట్కార్కు టికెట్ కేటాయించిన అధిష్ఠానం.. ఆ తర్వాత ఆయనను తప్పించి దామోదర రాజనర్సింహ వర్గానికి చెందిన సంజీవరెడ్డికి టికెట్ కేటాయించింది.
నారాయణఖేడ్‌లో లింగాయత్‌ల ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ టికెట్‌ను తొలుత బీసీ నేత, లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సురేశ్షేట్కార్కు ప్రకటించింది. దీంతో ఆయన శుక్రవారం నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా అధిష్ఠానం ఫోన్ చేసి ఆ టికెట్‌ను సంజీవరెడ్డికి ఇస్తున్నట్టు తెలిపింది. దీంతో సురేశ్ షేట్కార్ అధిష్ఠానం ఆదేశాల మేరకు సంజీవరెడ్డి గ్రామం పంచగామకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో సురేశ్షేట్కార్ వర్గీయులు ఖిన్నులయ్యారు. లింగాయత్ సామాజికవర్గం నేతలు కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. అయితే, బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డికి లభిస్తున్న ప్రజా మద్దతును చూసి భయపడే సురేశ్షేట్కార్ బరి నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరుగుతున్నది.
పటాన్చెరులో నీలంకు బదులు కాటాకు బీఫారం
పటాన్చెరు టికెట్‌ను కాంగ్రెస్ మొదట ముదిరాజ్ వర్గానికి చెందిన నీలం మధుకు ప్రకటించింది. మరో నేత కాటా శ్రీనివాస్‌గౌడ్ టికెట్ కోసం దామోదర రాజనర్సింహ ద్వారా గట్టి ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో ఆయన అనుచరులు రేవంత్, జగ్గారెడ్డి టికెట్ అమ్ముకున్నారంటూ దిష్టిబొమ్మలు దహనం చేశారు. శుక్రవారం నామినేషన్ వేసేందుకు నీలం మధు ఏర్పాట్లు చేసుకుంటుండగా, గురువా రం రాత్రే బీఫాంను శ్రీనివాస్‌గౌడ్‌కు అందజేసింది. ఈ అనూహ్య పరిణామంతో నీలం మధు దిగ్బ్రాంతికి గురయ్యారు. టికెట్ ఇస్తామంటేనే కాంగ్రెస్‌లో చేరానని, తనను నమ్మించి గొంతు కోశారని నీలం మధు ఆగ్రహం వ్యక్తంచేశారు. నీలం మధును తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. అయితే ఆయన మాత్రం బీఎస్పీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం.
రాజనర్సింహదే పైచేయి
దామోదర రాజనర్సింహ పార్టీలో పట్టును నిలుపుకోవడంలో సఫలీకృతులయ్యారు. తనకు సన్నిహితంగా ఉండే కాటా శ్రీనివాస్‌గౌడ్(పటాన్చెరు), సంజీవరెడ్డి(నారాయణఖేడ్)కి చివరకు టికెట్లు ఇప్పించుకోగలిగారు. వారిద్దరికి టికెట్లు ఇవ్వకపోతే పార్టీ వీడతానని అధిష్ఠానాన్ని హెచ్చరించారనే ప్రచారం జరుగుతున్నది. దామోదర రాజనర్సింహ పైచేయి సాధించడంతో జగ్గారెడ్డి వర్గం డీలా పడింది.