హైదరాబాద్, జనవరి 6 (నమస్తేతెలంగాణ) : తెలంగాణలో రేవంత్‌రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నదని, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి, జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడబోదని స్పష్టంచేశారు. రేవంత్ రాచరిక రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగంతో తిప్పికొడతామని హెచ్చరించారు. హామీలు అమలు చేయాలని నిత్యం నిలదీస్తున్నందుకే కేటీఆర్‌పై ఫార్ములా-ఈ రేస్ కేసుపెట్టి ఇబ్బందిపెడుతున్నారని ఆరోపించారు.
సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియా తో మాట్లాడుతూ.. రేవంత్ ఓట్ల కోసం మహిళలకు ప్రతినెలా రూ.2,500, కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతోపాటు తులం బంగారం, రైతాంగానికి ఎకరాకు రూ.15వేల రైతుభరోసా ఇస్తానని తప్పుడు హామీ లు గుప్పించారని విమర్శించారు. ఏడాది పాలనలో ఏ ఒక్క మంచిపని కూడా చేయని సీఎం పేరును ప్రజలు కూడా గుర్తుంచుకోవడంలేదని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో రేవంత్ పేరు మరిచిపోయిన యాంకర్‌ను జైలుకు పంపే ప్రమాదం ఉన్నదని చమత్కరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, మెతుకు ఆనంద్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.