హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితిని 65 నుంచి 70 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్టు తెలుస్తున్నది. సంబంధిత ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనతో తమ పదోన్నతుల అవకాశాలు దెబ్బతింటాయని యువవైద్యులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితిని 58 నుంచి 65 ఏండ్లకు పెంచడంతో చాలా మంది ప్రొఫెసర్లు వివిధ రకాల అనారోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలు తదితర కారణాలతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)కు ప్రయత్నిస్తున్నారని, అయినప్పటికీ రిటైర్మెంట్ వయోపరిమితిని మరో 5 ఏండ్లు పొడిగించాలని ప్రభుత్వం యోచించడం సరికాదని అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఎంతో మంది ప్రొఫెసర్లు 60 ఏండ్ల వయసుకే ఆరోగ్యం సహకరించక నానా ఇబ్బందులు పడుతున్నారని, అలాంటిది ఏడుపదుల వయస్సులో వారు విద్యార్థులకు పాఠాలు ఎలా చెప్పగలరని, రోగులకు వైద్యం ఎలా అందించగలరని ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న కొందరు హెచ్వోడీలు, టీచింగ్ ప్రొఫెసర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, కాసులు కురిపించే పదవుల కోసమే రిటైర్మెంట్ వయస్సును పొడిగించాలంటూ ప్రభుత్వం వద్ద అతితెలివి ప్రదర్శిస్తున్నారని యువవైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచింగ్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందితే మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ఏర్పడుతుందని, దీంతో పీజీ సీట్లు కోల్పోవాల్సి వస్తుందని కొందరు స్వార్థపరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 800 మందికిపైగా ప్రొఫెసర్లు ఉన్నారు. వారిలో దాదాపు 30 మంది మాత్రమే ఈ ఏడాది చివరినాటికి ఉద్యోగ విరమణ పొందనున్నారు.
ఇదే సమయంలో సుమారు 240 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు పదోన్నతి పొందుతారు. దీంతో ఎక్కడా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలే లేవు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,200 మంది వరకు సీనియర్ రెసిడెంట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులుగా ఉన్నారు. వీరితోపాటు 1,400 మంది మరో 5 నెలల్లో సీనియర్ రెసిడెంట్లు కానున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనతో తమకు అన్యాయం జరుగుతుందని ఈ 2,600 మంది వాపోతున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 2,733 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు యువ వైద్యులు చెప్తున్నారు.
ప్రభుత్వ ప్రతిపాదనను వైద్య సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. టీచింగ్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సు పెంపు వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని యువవైద్యులు వాపోతున్నారు. ముఖ్యంగా పదోన్నతులు, పరిపాలనా అవకాశాలు దక్కవని, ఏండ్ల తరబడి అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లుగానే మిగిలిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యార్థులకు, రోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
సీనియర్ అధ్యాపకులకు గౌరవంగా ఉద్యోగ విరమణ లభించాలని, రిటైర్మెంట్ వయసును పెంచి వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని కోరుతున్నారు. రిటైరైన సీనియర్ ప్రొఫెసర్లను మెంటార్లు, సలహాదారులుగా నియమించుకోవాలని సూచిస్తున్నారు. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న వైద్య రంగంలోకి దూసుకొస్తున్న ఏఐలాంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను 70 ఏండ్ల సీనియర్ ప్రొఫెసర్లు ఎప్పుడు నేర్చుకుని, రోగులకు సేవలు అందిస్తారని ప్రభుత్వ వైద్యుల సంఘం, తెలంగాణ రాష్ట్ర జూనియర్ డాక్టర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
టీచింగ్ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సును పెంచబోతున్నారన్న సమాచారంతో గాంధీ దవాఖాన వైద్యులు అత్యవసర సమావేశం నిర్వహించి, ప్రభుత్వ ఆలోచనను ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఇప్పటికే సకాలంలో పదోన్నతులు లభించక ఎంతో మంది అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు నిరీక్షిస్తున్నారని, ఇలాంటి తరుణంలో ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును పొడిగిస్తే వారికి మరింత నష్టం వాటిల్లుతుందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన ఆలోచనను విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అల్టిమేటం ఇచ్చినట్టు సమాచారం.