పరిగి, జూలై 31 : నకిలీ డీఏపీ దందాలో పలువురు డీలర్లు భాగస్వాములనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు ఆధారంగా మరికొందరు డీలర్ల దగ్గర కొన్న డీఏపీలో నకిలీ బయటపడడంతో గుట్టుచప్పుడు కాకుండా రైతులకు డబ్బులు ఇచ్చినట్టు సమాచారం. అసలు డీఏపీ ఎరువుల బస్తాల చాటున నకిలీవి సరఫరా చేశారన్న ఆరోపణలున్నాయి. నకిలీ డీఏపీ ఎక్కడ ఉందో ఆరా తీయడం, స్వాధీనం చేసుకోవడం పక్కన పెడితే డీలర్లను కాపాడేందుకు అధికారులే యత్నిస్తు న్నారన్న విమర్శలున్నాయి. చివరకు అధికార పార్టీ నాయకులూ రంగంలోకి దిగి ఈ అంశాన్ని కప్పిపుచ్చేందుకు కొందరి మధ్య డీల్ కుదిర్చేందుకు యత్నించడం నకిలీ దం దా జరిగిందనేందుకు మరింత బలాన్ని ఇస్తున్నది. సీఎం సొంత జిల్లాలో నకిలీ దం దా బాహాటంగా కొనసాగు తున్నా అసలు సూత్రధారులను పట్టుకొని శిక్షించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు.
ఇటీవల పూడూరు మండలంలోని మంచన్‌పల్లి, పరిగి మండలంలోని చిగురాల్‌పల్లి గ్రామాలలో నకిలీ డీఏపీ విక్రయాల కలకలం రేపగా.. మరికొందరు డీలర్ల దగ్గర కొన్న డీఏపీలోనూ నకిలీది ఉన్నట్టు తేలగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దినట్టు సమాచారం. పరిగి మండలంలోని బసిరెడ్డిపల్లికి చెందిన అజీమ్ మంచన్‌పల్లి, చిగురాల్‌పల్లి గ్రామాల్లో నకిలీ డీఏపీ విక్రయించారనే ప్రచారంతో వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి రైతుల వద్ద ఉన్నటువంటి డీఏపీ బస్తాలను సీజ్ చేశారే తప్ప అసలు ఈ డీఏపీ బస్తాలు ఎక్కడి నుంచి ఎవరు తెచ్చి విక్రయించారన్నది తేల్చలేదు. మరోవైపు అజీమ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి వ్యవసాయాధికారులు తమ చేతులు దులుపుకొన్నారు.
కాగా, పరిగి మండలంలోని చిగు రాల్పల్లికి చెందిన ఓ రైతు పరిగిలోని ఓ డీలర్ వద్ద 8 బస్తాల డీఏపీ కొనుగోలు చేయగా.. అందులోని ఓ బస్తాలోని ఎరువును పొలంలో వేసి 15 రోజులు దాటినా కరగలేదు. ఈ విషయాన్ని అతడు వ్యవసాయాధికారి దృష్టికి తీసుకెళ్లగా.. అలా జరిగేందుకు వీలు లేదంటూ డీలర్‌ను వెనుకేసుకొచ్చినట్టు సమాచారం. అలాగే, పరిగి మండలంలోని లక్నాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు పరిగిలోని ఓ డీలర్ వద్ద డీఏపీ బస్తాలు కొని.. పొలాల్లో ఆ ఎరువును చేతులతో చల్లడంతో వాటికి బొబ్బలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని సదరు రైతు డీలర్ దృష్టికి తీసుకెళ్లగా.. రైతు తీసుకెళ్లగా మిగిలిన డీఏపీ బస్తాలను షాపునకు తరలించి.. అన్నదాత చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చినట్టు తెలిసింది. ఇలాంటి ఘటనలను పరిశీలిస్తే నకిలీ డీఏపీ బస్తాలను చాలా మంది డీలర్లు విక్రయించినట్టు స్పష్టమవుతున్నది.
సీఎం సొంత జిల్లాలో నకిలీ డీఏపీ విక్రయాల అంశం బయటికి పొక్కగా దానిని పూర్తిస్థాయిలో అరికట్టడంతోపాటు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే కాపాడేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. నకిలీ డీఏపీ విక్రయాలకు సంబంధించి అజీమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అజీమ్ ఎవరి ప్రోద్బలంతో నకిలీ డీఏపీ తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో సూత్రధారులెవరనేది ఇప్పటికీ తేల్చలేదు. ఇందుకు ప్రధాన కారణం అధికార పార్టీ నేతల నుంచి ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి అని ప్రచారం జరుగుతున్నది.
నకిలీ డీఏపీ విక్రయాల్లో భాగస్వాములైన వారిని కాపాడేందుకు అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి తమ నేతలతో అధికారులకు ఫోన్లు చేయించారని తెలిసింది. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత వ్యవసాయాధికారులు ఒకరిద్దరు డీలర్ల షాపులను తనిఖీలు చేసి అన్ని సజావుగా ఉన్నట్టు ధ్రువీకరించడం గమనార్హం. సదరు డీలర్లపైనే నకిలీ డీఏపీ విక్రయాల ఆరోపణలు రాగా అదేమి లేదన్నట్లుగా అధికారుల తీరు ఉండడం విడ్డూరం. ఒకరిద్దరు అధికార పార్టీ నాయకులు డీలర్ల తరఫున వకాల్తా పుచ్చుకొని ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలా డీల్ కుదిర్చే ప్రయత్నాలు చేయడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు నకిలీ డీఏపీ విక్రయాల వెనకాల ఉన్న అసలు సూత్రధారుల ఆట కట్టిస్తే మరోసారి ఇలాంటివి జరగకుండా ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు.