హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘నేను ఉద్యోగ విరమణ పొంది 16 నెలలైంది. నాకు రూ.40 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి. రూ.20 లక్షల వరకు ఇంటిలోన్ ఉన్నది. ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ అందగానే పూర్తిలోన్ను చెల్లించాలని అనుకున్న. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయీ ఇవ్వలేదు. వడ్డీలు సహా ఉత్తగ బ్యాంక్ కిస్తీలు కడుతున్న. నా పైసలు నాకిచ్చేందుకు ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం’ అంటూ రిటైర్డ్ టీచర్ బదిరీ నారాయణరావు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించారు. ఉద్యోగ విరమణ ప్రయోజనాలు చెల్లించకపోవడంతో తాను నెలకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు వడ్డీ సహా కిస్తీలు చెల్లించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘నా డబ్బులు నాకిస్తే అప్పులు కట్టుకుంట.. వడ్డీల తిప్పలుండదు కదా’ అంటూ బదిరీ నారాయణరావు తన గోడును వెల్లబోసుకున్నారు. తన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఎప్పుడిస్తారో చెప్పాలని సర్కారును నిలదీశారు. ఇది ఒక్క బదిరీ నారాయణరావు బాధే కాదు.. రాష్ట్రంలోని పలువురు రిటైర్డ్ ఉద్యోగుల మనోవేదన. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మరిన్ని విషయాలను పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా అయిన నారాయణరావు ఆవేదన ఆయన మాటల్లోనే..
రూపాయిన్నర వడ్డీ కడుతున్నా
‘నేను 2024జూన్‌లో రిటైరైన. 2025 జూన్‌కు ఏడాది గడిచింది. ఇప్పటికి 16 నెలలైంది. గ్రాట్యుటీ, కమ్యూటేషన్ మా హక్కు. ప్రభుత్వం దయా దాక్షిణ్యాలతో ఇచ్చేవేం కాదు. నా ఇంటి కోసం రూ.20 లక్షలు అప్పు చేశా. దీనికి నెలకు రూపాయిన్నర వడ్డీ కడుతున్నాం. రిటైరయ్యాక అప్పులు తీర్చుకుని ప్రశాంతంగా ఉందామనుకున్నా. ఇప్పటికీ రూపాయి కూడా ఇవ్వలేదు. వచ్చే పెన్షన్ అసలు, వడ్డీకే పోతున్నది. 80 ఏండ్ల అమ్మకు ఆరోగ్యం బాగా లేకుంటే దవాఖానకు తీసుకెళ్లలేకపోతున్న. రిటైరై ప్రశాంతంగా ఉందామనుకుంటే సర్కార్ నిర్లక్ష్యంతో మానసిక ప్రశాంతత ఉండటం లేదు. సంపాదించుకున్నది పోయింది. చికాకు టెన్షన్ మిగిలింది. టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. పోనీ వైద్యం చేయించుకుందామంటే హెల్త్‌కార్డు కూడా లేదు. అయ్యా రేవంత్‌రెడ్డి గారు మీకు నచ్చిన స్కీంలు అమలు చేసుకోండి. ఇష్టమొచ్చిన పథకాలు పెట్టుకోండి. మాకేం అభ్యంతరం లేదు.కానీ రిటైర్డ్ ఉద్యోగుల గుండె బాధను అర్థం చేసుకోండి’
ఆత్మహత్యలే శరణ్యమా!
‘రైతన్నలు, నేతన్నలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు చూశాం. కానీ ఇప్పుడు దురదృ ష్టం కొద్ది పెన్షనర్లు కూడా ఆత్మహత్య లు చేసుకోవాల్సిన పరిస్థితిని సర్కారు కల్పించింది. విద్యావంతులు, ఉద్యమకారులకు ఈ దుస్థితి రావడం శోచనీయం. వాస్తవానికి నేను ముందే వీఆర్ఎస్ తీసుకుందామనుకున్నా. కా నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, అటూ జీతం లేక, ఇటూ ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందక అవస్థలు పడాల్సి వస్తుందని ఆ ఆలోచనను విరమించుకున్నా. తీరా చూస్తే 450 రోజులు గడిచినా నయా పైస ఇవ్వలేదు. సర్కారుపై పోరాడాల్సిన ఉద్యోగ సంఘాలు నిమ్మకుంటున్నాయి. కాలపరిమితితో రెండు నెలల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలి. మా సహనాన్ని పరీక్షించొద్దు. సర్కారు స్పందించకపోతే పెన్షనర్ల సత్తా చూపుతాం’ అని హెచ్చరించారు.
పెన్షనర్ల ప్రాణాలు కాపాడాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, గతేడాది నుంచి పెన్షన్ బకాయిలు విడుదల కావడం లేదని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ మండిపడ్డారు. సర్వీసులో ఉన్నప్పుడు దాచుకున్న తమ సొమ్మే తిరిగి ఇవ్వకుండా రేవంత్ సర్కారు వేధిస్తున్నదని ఆదివారం ఒక ప్రకటనలో ఆగ్రహించారు. ప్రతినెల రూ.700 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం వల్ల రావాల్సిన డబ్బులు రాక వారు మానసిక ఒత్తిడితో ప్రాణాలు సైతం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.15వేల కోట్ల బకాయిలు ప్రతినెలా చెల్లించినా వాటికి రెండేండ్లు పడుతుందని దీనికి తోడు ప్రతినెలా రిటైరయ్యే ఉద్యోగుల పరిస్థితి ఇక చెప్పనవసరం లేదని వివరించారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, పెన్షనర్ల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలదేనని పేర్కొన్నారు. పీఆర్సీలు, హెల్త్‌కార్డులు, ఐదు డీఏల జాడే లేదని సర్కారును దుయ్యబట్టారు. సీపీఎస్ రద్దుపై నాన్చివేత ధోరణే తగదని.. దీపావళి పండుగ సందర్భంగా డీఏలు విడుదల చేయాలని దేవీప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.