నెల్లికుదురు, జూన్ 25 : రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మనోవేదనకు గురై గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లిలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండేటి సోమిరెడ్డి(63) రాజులకొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయడిగా విధులు నిర్వర్తించి 2024, సెప్టెంబర్ 2న ఉద్యోగ విరమణ పొందాడు.
ఆయనకు రావాల్సిన రూ.54 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందడానికి దరఖాస్తు చేసుకున్నాడు. రిటైర్మెంట్ కాక ముందు కొన్ని లోన్లు తీసుకున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో వాటిని చెల్లించాలని నిశ్చయించుకున్నాడు. రిటైర్ అయి 9 నెలలు గడుస్తున్నా సంబంధిత బెనిఫిట్స్ అందకపోవడం, పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న క్రమంలో.. రిటైర్డు అయిన వారు వేల సంఖ్యలో ఉన్నారు.. అందులో మీ నంబర్ ఎప్పుడో….? అని పలువురు అనడంతో అదే మాటను మనసులో పెట్టుకుని మనోవేదన గురై 14 రోజుల క్రితం బీపీ పెరగడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు.
నాకు రావాల్సిన రిటైర్మెంట్ డబ్బులు రాలేదు..మీరు ట్రీట్మెంట్కు రూ. లక్షలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు..? రిటైర్మెంట్ డబ్బులు ఎప్పుడు వస్తాయో..? ఎందుకు చికిత్స కోసం అప్పులు చేస్తున్నారు అంటూ సోమిరెడ్డి మనోవేదన గురయ్యేవాడు. మానసిక వేదనతో ఫిజికల్‌గా ట్రీట్మెంట్కు బాడీ సహకరించకపోవడంతో మంగళవారం రాత్రి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చి ఉంటే తన తండ్రి చనిపోయేవాడు కాదని మృతుడి కుమారుడు కిశోర్‌కుమార్ వాపోయాడు.