IAS Srinivas Raju | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి చెందిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్‌కు కీలక పదవి కట్టబెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాస్ రాజు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ రాజు ప్రిన్సిపల్ సెక్రటరీగా రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.
శ్రీనివాస్ రాజు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆఫీసర్. గతంలో టీటీడీ జేఈఓగా శ్రీనివాస్ రాజు పని చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటేషన్‌పై రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగానూ పని చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పదవీ విరమణ పొందిన ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ రాజు.. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఆయన ప్రభుత్వ సలహాదారుగా నియామకమైన విషయం తెలిసిందే. అప్పట్లో శ్రీనివాస్ రాజు.. బ్యూరోక్రాట్లకు కొత్త తలనొప్పులు తెచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. మళ్లీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీనివాస్ రాజ్ నియామకం కావడం చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్లో 2001 బ్యాచ్‌కు చెందిన ఆయన 2011లో వైజాగ్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో టీటీడీ జేఈవోగా నియమితులయ్యారు. ఏప్రిల్ 20వ తేదీన జేఈవోగా బాధ్యతలు తీసుకుని 2019 జూన్ వరకు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఎనిమిదేండ్ల రెండు నెలలపాటు పనిచేశారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో జేఈవోగా విధులు నిర్వహించి, టీటీడీలో తనదైన ముద్ర వేశారు.
అయితే 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయన ఇంటర్ కేడర్‌పై తెలంగాణ రాష్ర్టానికి వచ్చారు. తెలంగాణ నాలుగేండ్ల పాటు రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2024 మార్చి నెలతో డిప్యుటేషన్ గడువు ముగియడంతో పొడిగింపునకు క్యాట్‌ను ఆశ్రయించారు. అనుమతి రాకపోవడంతో ఏపీకి రాక తప్పలేదు. గత మే నెలలో ఏపీ సీఎస్‌కు రిపోర్టు చేశారు. టీటీడీ ఈవోగా వచ్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినా కూటమి ప్రభుత్వం శ్యామలరావును ఈవోగా నియమించింది. 2024 జూన్ నెలలో శ్రీనివాసరాజు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.