నీలగిరి, నవంబర్ 22: రిటైర్డ్ బెనిఫిట్స్ అందించాలని కోరుతూ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అడ్డుకునే యత్నంచేశారు. శనివారం జిల్లా కేంద్రానికి ఇందిరమ్మ చీరల పంపిణీకి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వచ్చారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఉన్నట్టు తెలియడంతో రిటైర్డ్ ఉద్యోగులు ఎన్జీ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరారు. మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అందాల్సిన పెన్సన్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ కార్యాలయం మీదుగా క్లాక్‌టవర్ సెంటర్లోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. డీఎస్పీ శివరాంరెడ్డి కలుగజేసుకుని మంత్రిని కలిపించడంతో వారు ఆయనకు వినతిపత్రం అందజేశారు.