హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : దళితబంధు పథకాన్ని విజయవంతం చేయడంలో వాచ్‌డాగ్‌లా పనిచేస్తామని రిటైర్డ్ ఉద్యోగులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన దళితయజ్ఞంలో భాగస్వామ్యమవుతామని ప్రకటించారు. మంగళవారం సెంటర్ ఫర్ దళిత్‌స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్‌లో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. దళితబంధు పథకంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నదని, అనేక రాష్ర్టాల నుంచి దళితాభ్యుదయం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, సామాజిక, ఆర్థికవేత్తలు, వర్సిటీల ప్రొఫెసర్లు దళితబంధు పథకాన్ని స్వాగతించారని మల్ల్లెపల్లి లక్ష్మయ్య వెబినార్ ప్రారంభంలో వివరించారు. పథకం ప్రారంభ సమయంలోనే అదేపనిగా వ్యతిరేకించటం కాకుండా నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. యావత్ దళిత సమాజం జీవితాలను శాశ్వతంగా బాగుపరిచేందుకు ప్రభుత్వమే పూనుకోవటం గొప్ప విషయంగా భావించాలని సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, మండలాలవారీగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల డాటాను సేకరించాలని నిర్ణయించారు. వారం పది రోజుల్లో మరోసారి రిటైర్డ్ ఉద్యోగుల సంఖ్య, ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలకు అనుగుణంగా కమిటీలు వేసుకోవాలని అభిప్రాయపడ్డారు. వెబినార్‌లో రిటైర్డ్ ఉద్యోగులు పూలాల సంజీవయ్య, వేల్పుల రత్నం, రౌతు సంపత్‌కుమార్, గరిగే చంద్రయ్య, గూడెపు మొగిలయ్య, టీ. దర్శనం, తోగరు హనుమయ్య, తలారి శంకరయ్య, మద్దూరి రాజనర్సు, కనుమల్ల గణపతి, డాక్టర్. పీ. సంపత్‌రావు, నేమాని రాము, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సమన్వయకర్త గురజాల రవి తదితరులు పాల్గొన్నారు.