ముకరంపుర, జూన్ 6: రిటైర్డ్ విద్యుత్తు ఉద్యోగులు మేనెల పెన్షన్ జమ కాకపోవడంతో కరీంనగర్లోని సర్కిల్ కార్యాలయం ఎదుట నిరసన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ.. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కో సంస్థల పరిధిలో 22వేల మంది రిటైర్డ్ ఉద్యోగులపై ప్రభుత్వం, విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ‘రైతు డిస్కమ్’ ఏర్పాటుపై ఈఆర్సీ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో విద్యుత్తురంగానికి చెందిన పలువురు రిటైర్డ్ ఉద్యోగులు రైతు డిస్కమ్ ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా అభిప్రాయాలు తెలియజేశారని తెలిపారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. కరోనా సమయంలోనూ ఒకటిన పెన్షన్ అందుకున్నామని, ప్రస్తుతం మే నెల సొమ్మును మాత్రం ఇప్పటి వరకు చెల్లించకపోవడం బాధాకరమని వాపోయారు. పెన్షన్ చెల్లింపుల కోసం జెన్కోలో ప్రత్యేకంగా ట్రస్ట్ ఉన్నదని, ప్రతినెలా ఈ ట్రస్ట్ ద్వారానే చెల్లింపులు జరుగుతాయని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతినెల ఒకటిన పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ విద్యుత్తు ఉద్యోగుల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సాగర్రావు, నాయకులు మహేందర్, భాసర్కుమార్, రామయ్య, ఉస్మాన్, దేవేందర్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.