ఖైరతాబాద్, సెప్టెంబర్ 13 : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణలో భాగంగా తామిచ్చిన రిపోర్టును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తొక్కిపెట్టిందని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్, ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడు దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ జర్నలిస్ట్ రమణకుమార్ అధ్యక్షతన ‘గోదావరి జలాలు-కాళేశ్వరం ప్రాజెక్టు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఘోష్ నివేదికలో తాము చెప్పిన అంశాలు, ఇచ్చిన రిపోర్టుకు సంబంధించిన ప్రస్తావనే లేదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను బూచిగా చూపి గోదావరి జలాలను బనకచర్లకు తరలించుకపోయే కుట్రను తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ప్రాంతీయ అస్థిత్వం లేకుండా చేస్తే తెలంగాణ వనరులను దోచుకోవచ్చని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారని విమర్శించారు.
తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని తెలిసినా ఉద్దేశ్యపూర్వకంగా తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. రిటైర్డ్ ఇంజినీర్ టీ వెంకటేశం మాట్లాడుతూ ఇప్పుడు నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చిందని, మనకు కేటాయించిన 969 టీఎంసీల నీటిలో 300 టీఎంసీలు కూడా వాడుకోలేదని తెలిపారు. గోదావరిలో మనకు కేటాయించిన నీటిని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలంటే కాళేశ్వరం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. సీపీఎం నాయకులు సాగర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు మొత్తం ఖర్చు లక్ష కోట్లే కాలేదని, అయినా లక్ష కోట్లు తిన్నారంటూ ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయని మండిపడ్డారు. తెలంగాణలో వరి ధాన్యం, పంటల ఉత్పత్తి పెరిగిందంటే అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్, నీటిపారుదల రంగ నిపుణులు వీరమల్ల ప్రకాశ్, సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి, సీపీఐ నేత పశ్య పద్మ, సీనియర్ జర్నలిస్టులు నరా విజయ్, శివారెడ్డి, రాము, హుస్సేన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.