Retirement | హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రానున్న మార్చి 31 తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల విరమణలు పునఃప్రారంభం కానున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచిన తరువాత తొలి బ్యాచ్ రిటైర్మెంట్లు 2024 మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. 2024 మార్చి నుంచి డిసెంబర్ వరకు 8,194 మంది, 2025లో 9,213 మంది, 2026లో 9,231 మంది, 2027లో 8,917 మంది, 2028లో 8,496 చొప్పున ఉద్యోగులు విరమణ పొందనున్నట్టు సమాచారం. మొత్తంగా రాబోయే ఐదేండ్లల్లో 44,051 ఉద్యోగులు రిటైర్ కానున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 3.5 లక్షల ఉద్యోగులు ఉన్నారు. అంటే 10 శాతానికి పైగా ఉద్యోగులు రాబోయే రోజుల్లో విరమణ పొందనున్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యోగుల విభజనలో భాగంగా కొంతమంది ఉద్యోగులను తెలంగాణకు, మరికొందరిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కీలకశాఖల్లో ఉద్యోగుల కొరత ఏర్పడింది. దీనికితోడు ఏటా వేలాది ఉద్యోగులు విరమణ పొందాల్సి ఉండటంతో ప్రభుత్వ విభాగాలన్నింటిలో ఉన్నతోద్యోగుల కొరత తలెత్తకుండా నివారించేందుకు కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతూ 2021 మార్చిలో ఉత్తర్వులు జారీచేసింది. అప్పటినుంచి ప్రభుత్వ శాఖలతోపాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, ఇతర సంస్థలు, వర్సిటీల్లో (బోధనేతర సిబ్బంది) ఏ ఒక్కరూ పదవీ విరమణ పొందలేదు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును సైతం 61కి పెంచింది. సింగరేణిలో కూడా మార్చి 31 నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి.