Gurukula Results | హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల పరీక్ష ఫలితాలు అస్తవ్యస్తంగా మారాయి. ఒక జాబితాలో పేరు ఉండగా, మరో జాబితాలో పేరు లేకపోవడం, ఒక జాబితాలో ఒక చోట సీటు కేటాయించగా, మరో జాబితాలో మరో చోట సీటు కేటాయించడంతో అంతా గందరగోళంగా మారింది. దీనిపై అధికారులెవరూ స్పష్టత ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 51,968 సీట్ల భర్తీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 23న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. తొలుత మార్చి 29న ప్రత్యేక వర్గాలకు చెందిన జాబితాను ప్రకటించారు. 1,944 మంది సీట్లు పొందినట్టు వెల్లడించారు. ఆ తరువాత ఏప్రిల్4న 38,278 మంది విద్యార్థుల జాబితా విడుదల చేశారు. మిగిలిన సీట్ల జాబితా కూడా వెల్లడించారు.
సీటు వచ్చినట్టా.. లేనట్టా..?
విద్యార్థిని కస్తూరి అభినయకు నిర్మల్ జిల్లా, ముధోల్ ట్రైబల్ వెల్ఫేర్‌లో, బంక అశ్వంత్, బంక హర్షిత్‌కు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ట్రైబల్ వెల్పేర్‌లో సీటు పొందినట్టు మొదటి జాబితాలో చూపించారు. ఆ తదుపరి విడుదల చేసిన మెరిట్ జాబితాలో సదరు విద్యార్థుల పేరే లేకపోవడం గమనార్హం. నిర్మల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ బీసీ వెల్ఫేర్ పాఠశాలలో తొలుత సీటు వచ్చినట్టు వెల్లడించారు. ఆ తదుపరి విడుదల చేసిన జాబితాలో మాత్రం నిర్మల్ జిల్లాలోని ఎస్సీ పాఠశాలలో సీటు పొందినట్టు చూపించారు. మరో విద్యార్థినికి నిర్మల్ జిల్లాలోని జాం ఎస్సీ గురుకులంలో సీటు వచ్చినట్టు తొలుత చూపించారు. ఆ తరువాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో సీటు వచ్చినట్టు పేర్కొంటూ జాబితా విడుదల చేశారు. ఆన్లైన్లో హాల్‌టికెట్ ఎంటర్ చేయగానే విద్యార్థి ర్యాంకు, సీట్ అలాటైతే సంబంధిత వివరాలు వచ్చేవి. కానీ ప్రస్తుతం అలాంటిదేమీ లేకుండా మెరిట్ జాబితా, ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ జాబితా అంటూ పీడీఎఫ్ ఫైల్స్ మాత్రమే ఎస్సీ గురుకుల సొసైటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఒక జాబితా 767 పేజీలు ఉండగా, మరో జాబితా 1,835పేజీలు ఉంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల సీటు వివరాలు తెలుసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందిస్తలేరని మండిపడుతున్నారు.