Inter Exams | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పరీక్షల్లో తప్పిదాలు మీద తప్పిదాలు.. తప్పుల మీద తప్పులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా అధికారుల నిర్లక్ష్యంతో ఓ భారీ తప్పిదం వెలుగుచూసింది. ఏకంగా ఎనిమిది మంది విద్యార్థులకు ఒక ప్రశ్నపత్రానికి బదులు మరో ప్రశ్నపత్రాన్ని ఇచ్చిన విషయం బయటికొచ్చింది. విద్యార్థులకు ప్రశ్నపత్రం ఇవ్వడం.. పరీక్షలు రాయడం.. మూల్యాకంనం చేయడం అంతా జరిగిపోయింది. తీరా ఫలితాల విడుదల సమయంలో మాత్రం ఆయా విద్యార్థుల ఫలితాలు నిలిపివేశారు. పాసయ్యారా..? ఫెయిలయ్యారా ? అన్న విషయాన్ని వెల్లడించలేదు. అధికారుల తప్పిదాలకు విద్యార్థులను బలిచేశారు.
100 మార్కుల ప్రశ్నపత్రం ఇవ్వాల్సి ఉండగా, విద్యార్థులకేమో 80 మార్కుల ప్రశ్నపత్రం ఇచ్చారు. 20 మార్కుల ప్రాక్టికల్స్‌కు వీరు హాజరుకాలేదు. ఇంటర్ వెబ్సైట్లో ప్రైవేట్ విద్యార్థులుగా నమోదయ్యింది. మార్కులేలా వేయాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రాక్టికల్స్ నిర్వహించి మార్కులేయాలా.. ? లేక 80 మార్కులకే విద్యార్థులకు ఎన్ని మార్కులొస్తే అన్ని మార్కులు కేటాయించాలా? అన్న ప్రశ్నలొస్తున్నాయి. ప్రస్తుతానికైతే విద్యార్థుల ఫలితాలు నిలిపివేశారు. దీంతో విద్యార్థుల్లో టెన్షన్పట్టుకుంది. ఇదే విషయాన్ని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య దృష్టికి తీసుకెళ్లగా, రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
2024-25లో ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ ప్రవేశపెట్టారు. ఈ ఒక్క సబ్జెక్టులో పరీక్షావిధానం మారింది. 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. గతంలో ఇంగ్లిష్‌లో ఫెయిలైన విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఉండవు.. కనుక వీరికి 100 మార్కులకు పరీక్షలు నిర్వహించాలి. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షల్లో ఫెయిలైన వారికి ఓల్డ్ వర్షన్, రెగ్యులర్ విద్యార్థులకు కొత్త వర్షన్ ప్రశ్నపత్రాలివ్వాలి. కానీ ఓల్డ్ వర్షన్ ప్రశ్నపత్రాలివ్వాల్సిన వారికి న్యూ వర్షన్ ప్రశ్నపత్రాలిచ్చారు.
100 మార్కులకు నిర్వహించాల్సిన పరీక్షకు బదులు 80 మార్కుల ప్రశ్నపత్రం ఇచ్చారు. విద్యార్థులు యథాలాపంగా పరీక్షలు రాసేశారు. అధికారులు, పరీక్షాకేంద్రం సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ తప్పిదం జరిగింది. వాస్తవానికి సెంటర్లవారీగా ప్రైవేట్ (ఫెయిలైన), రెగ్యులర్ విద్యార్థుల నామినల్ రోల్స్ ఉంటాయి. ఈ రోల్స్‌లో అన్ని రకాల వివరాలుంటాయి. పైగా ఓల్డ్, కొత్త ప్రశ్నపత్రాల ప్యాకింగ్ కూడా వేర్వేరుగా ఉంటుంది. విద్యార్థులకు ఒకదానికి బదులు మరో ప్రశ్నపత్రం ఇవ్వడం… పొరపాటును గ్రహించకపోవడం గమనార్హం.