హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల అనంతరం తనకు భద్రతను తగ్గించేశారని, ప్రాణహాని ఉన్నందున ఎన్నికల ఫలితాలకు ముందున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు త్వరలో విచారణ జరపనుంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు అందించిన భద్రత ప్రాముఖ్యతను జగన్ గుర్తుచేశారు. తన పదవికున్న సున్నితమైన స్వభావం, ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల దృష్ట్యా తనకు భద్రత అత్యంత కీలకమని పేరొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఆశ్చర్యకరంగా నెల రోజుల్లోనే తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భద్రతను తగ్గించారని పిటిషన్లో పేరొన్నారు. జడ్ ప్లస్‌గా ఉన్న తన భద్రతను తగ్గించడంతో పాటు భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా భారీగా తగ్గించేశారని ఆరోపించారు. ప్రస్తుతం తనకు అన్ని వేళలా కేవలం ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నారు. గతంలో తనకు 139 మంది భద్రతా సిబ్బంది ఉండగా.. దాన్ని 59కి కుదించారని, దీన్ని పునరుద్ధరించాలని జగన్ తన పిటిషన్లో కోరారు.