హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ అర్బన్ మండలం పాల్కొండ గ్రామ శివారులో సర్వే నంబర్ 272/1లో 7 ఎకరాల 30 గుంటల భూమి విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి సోదరుల పేరు చెప్పి, మహబూబ్‌నగర్ స్థానిక ప్రజాప్రతినిధి అండ చూసుకొని రెచ్చిపోతున్న కాంగ్రెస్ నేత చలువగాలి రాఘవేందర్‌రాజుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘సీఎం సోదరుల పేరుతో బెదిరింపు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో శనివారం ఉదయమే సంబంధిత రిపోర్టర్ నుంచి వివరాలు తెప్పించుకున్న సీఎంవో.. రాఘవేందర్రాజును తీవ్రంగా మందలించినట్టు తెలిసింది.
‘నీ హద్దుల్లో నువ్ ఉండు.. ప్రతి విషయంలోనూ సీఎం సోదరుల పేరు చెప్పి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు. ఇకనైనా మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని హెచ్చరించినట్టు తెలిసింది. కాగా, ఇదే విషయమై డీజీపీ జితేందర్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ భూ వివాదం కేసులో పోలీసుల అండ చూసుకొనే రాఘవేందర్ రాజు రెచ్చిపోయారని స్థానిక ఎస్పీ ద్వారా ఇంటెలిజెన్స్ డీజీకి సమాచారం అందింది.
ఈ క్రమంలో బాధితులను తమ వాహనంలో హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు పోలీసులే తీసుకెళ్లడం, పోలీసుస్టేషన్లోనే సెటిల్మెంట్లకు పాల్పడటం, నిందితుడి సమక్షంలో బాధితుడిని చంపేస్తామని బెదిరించిన ఘటనలపై పోలీసుశాఖ సీరియస్ అయినట్టు తెలిసింది. సదరు సీఐ, ఎస్ఐలపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్టు సమాచారం. నిష్పక్షపాతంగా పోలీసులపై చర్యలు తీసుకుంటారా? లేక సీఎం ఇలాఖాలో అవన్నీ కామన్ అని వదిలేస్తారా? అనేది చూడాల్సి ఉన్నది. కాగా, ‘ఇక నుంచి సివిల్ కేసుల్లో తలదూర్చేది లేదు’ అని సదరు సీఐ స్థానిక మీడియా ప్రతినిధులతో వాపోయినట్టు తెలిసింది.