హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు ప్రస్తుత 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించినప్పటికీ ఇంతవరకు ఒక్క పైసా విడుదల చేయలేదు. దీంతో సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయి. అంతేకాదు, గతంలో వివిధ పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు చేయాల్సిన చెల్లింపులు కూడా పెండింగ్‌లో పడ్డాయి. కాగా, వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు ఒక్క పైసా కూడా విదిల్చకపోవడంతో పథకాల అమలుకు ఆటంకం ఏర్పడింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివేకానంద విదేశీ విద్య, బెస్ట్ వంటి పథకాలకు ఎంపికైన అభ్యర్థులకు దాదాపు రూ.50 కోట్లకుపైగా చెల్లింపులు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు వివిధ విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. కానీ, మూడు త్రైమాసికాలు ముగిసినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో గతంలో పెండింగ్‌లో ఉన్న చెల్లింపులు జరగకపోగా, ప్రస్తుత ఏడాది కోసం వచ్చిన దరఖాస్తులు సైతం అటకెక్కాయి. ప్రభుత్వం పాలకమండలిని ఏర్పాటు చేయకపోవడం, నిధులు విడుదల చేయకపోవడంతో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధికారులు కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించకపోగా, ఉన్న దరఖాస్తులను కూడా పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి విజ్ఞప్తి మేరకు గత డిసెంబర్లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు సంబంధించి వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఇవ్వాల్సిన నిధులను చెల్లించేందుకు గాను రూ.40 కోట్లు విడుదల చేయాలని ప్లానింగ్ శాఖ.. ఆర్థిక శాఖకు లేఖ రాసింది. అయినా ఫలితం దక్కలేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన రూ.50 కోట్లు విడుదల చేస్తే పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు చెల్లింపులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది కొత్త దరఖాస్తులు ఆహ్వానించకపోగా, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా ముట్టుకోకపోవడంతో ప్రస్తుతానికి రూ.50 కోట్లు సరిపోతాయని వారు పేర్కొంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆయా సంక్షేమ పథకాలను కొనసాగించాలని భావిస్తే అందుకు తగినట్టుగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప కొత్త దరఖాస్తుల ప్రక్రియ చేపట్టే వీలులేదని వారు వివరించారు. ఇటీవల దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్‌గా నియమించడంతోపాటు ఆమెకు చెక్ పవర్‌ను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బ్రాహ్మణ సంఘాలు ఇప్పటికే మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ముఖ్య కార్యదర్శికి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. అయినా ఫలితం లేకుండా పోయింది.
రానున్న ఆర్థిక సంవత్సరం 2025-26 బడ్జెట్లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ.350 కోట్లు కేటాయించాలని అధికారు లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. విదేశీ విద్య, బెస్ట్ తదితర పథకాల అమలుతోపాటు గోపన్‌పల్లి, సూర్యాపేట బ్రాహ్మణ సదన్ల పనులను పూర్తి చేసేందుకు ఈ మేరకు నిధులు అవసరమని వారు పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ బ్రాహ్మ ణ సంక్షేమ పరిషత్‌కు ఏటా రూ.100 కోట్లకు తగ్గకుండా నిధులు కేటాయించేది. దీంతో సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ, బ్రాహ్మణ సదన్ల నిర్మాణం వంటి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలను, నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు రూ.350 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు.