కొడకండ్ల, డిసెంబర్ 29 : ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన జనగామ జిల్లా వాసి అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన గొడుగు శ్రీనివాస్ (52) ఉపాధి కోసం ఈ ఏడాది జూలై 24న దక్షిణాఫ్రికా దేశంలోని కాంగో రాష్ట్రం లుపోమాషి నగరానికి వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పనికి కుదిరాడు. ఈనెలలో మలేరియా రావడంతో కంపెనీలోని డాక్టర్లు ఇచ్చిన మందులు వాడాడు. సరైన వైద్యం అందకపోవడంతో లివర్ ఇన్ఫెక్షన్తో ఈ నెల 25న మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చనిపోయి 4 రోజులైనా తమకు ఎలాంటి సమాచారం లేదని, మృతదేహం ఎప్పుడు వస్తుందో తమకు తెలియదని, ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.