వలసపాలకులు హైదరాబాద్ భూములపై చూపిన శ్రద్ధ.. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంపై ఏమాత్రం చూపలేదు. ఇందుకు నాటి హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థనే నిలువెత్తు నిదర్శనం! నిజాం రాజు నిర్మించిన హుస్సేన్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలే తప్ప 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తాగునీటికే అంకితం చేస్తూ నిర్మించిన ఏ ఒక్క జలాశయమూ లేదు. తొలుత 60-70 కిలోమీటర్ల దూరంలో మంజీరాపై నిర్మించిన సింగూరును సాగునీటికి దూరం చేసి హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా వ్యవస్థగా మార్చి రోజుకు 120 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేశారు.
Hyderabad | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : అది కంటితుడుపుగా మిగిలిపోవడంతో మళ్లీ 115 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది నుంచి రోజుకు 270 మిలియన్ గ్యాలన్లు, అదీ డిమాండ్‌ను తీర్చకపోవడంతో 200 కిలోమీటర్ల దూరంలోని గోదావరి నదినీ ఆశ్రయించారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి పైప్‌లైన్ వేసి రోజుకు 172 మిలియన్ గ్యాలన్ల జలాలను సరఫరా చేయడం మొదలు పెట్టినా అవసరాలు తీరని దుస్థితి! కారణం ఉమ్మడి పాలకులు అనుసరించిన లోపభూయిష్ట విధానాలు! వందల కిలోమీటర్లు పైప్‌లైన్ ద్వారానే నీటిని నిరంతరాయంగా పంపిణీ చేసేలా ప్రాజెక్టులను చేపట్టడం తప్ప ఎక్కడా హైదరాబాద్ నగరానికి సరిపడా తాగునీటి నిల్వకు శాశ్వతంగా రిజర్వాయర్ నిర్మించాలనే ఆలోచనే చేయలేదు.
ఫలితంగా ఆయా పైప్లైన్లలో ఎక్కడ చిన్న లోపం తలెత్తినా అది సర్దుబాటు అయ్యేవరకు నీటి కొరతను ఎదుర్కోక తప్పని దుస్థితి నెలకొన్నది. 24/7 పైపులైన్లలో నీటి సరఫరా జరిగితేనే తప్ప హైదరాబాద్ మనుగడ లేని పరిస్థితి. వరదలు వచ్చిన సందర్భంలో నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు కూడా లేకపోవడంతో ఎండకాలం వచ్చిందంటే జలమండలి కార్యాలయం ముందు ఖాళీ బిందెల ప్రదర్శనలు ఆనవాయితీ మారాయి. కాలనీల్లో ట్యాంకర్ల వద్ద నీటి యుద్ధాలు నిత్యకృత్యమయ్యాయి. ఒక సందర్భంలో విజయవాడ నుంచి రైల్వే వ్యాగన్లలోనూ మంచినీటిని నగరానికి తరలించిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి పాలకుల తీరుతో తాగునీటి కోసం హైదరాబాద్ నగరం నదుల వెంట ఉరుకులు పరుగులు పెట్టింది. దీంతో భూగర్భజలాలను పాతాళంలో నుంచి తోడి అవసరాలు తీర్చుకోవడంతో మహా నగరంలో ఎక్కడైనా వెయ్యి ఫీట్ల మేర బోర్లు వేసినా పాతాళ గంగ పైకి రాని దుస్థితి నెలకొన్నది.
హైదరాబాద్ నీటి అవసరాలు..అంచనాలు..డిమాండ్ (టీఎంసీల్లో)
దేశంలోని పలు మెట్రో నగరాల్లో తాగునీటి డిమాండ్.. సరఫరా.. లోటు ఇలా..