వాన చినుకు జాడలేదు.. ఉన్ననీటిపై సోయిలేదు. ఎల్ నినోపై ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తత నెలకొంటే.. రాష్ట్రంలో మాత్రం గత ప్రభుత్వంపై కక్షతో సాగును సంక్షోభంలోకి నెడుతున్నది కాంగ్రెస్ సర్కార్. వానకాలంలో రాష్ట్రవ్యాప్తంగా కోటీ 35 లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 33 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. అంటే జూన్ దాటి జూలై మొదటివారంలోకి వచ్చినా కేవలం 24 శాతమైనా పంటల సాగు పూర్తికాలేదు. వరి విషయానికి వస్తే ఈ సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి వేయాల్సి ఉండగా.. ఇంతవరకు లక్షా 10 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. నిరుటితో పోల్చితే సాగు ఈ సారి 56 శాతం తగ్గింది. ఇది సాగుకు సంబంధించి ప్రమాదకర సంకేతాలు. ఎల్ నినో మోగిస్తున్న దుర్భిక్ష ఘంటికలు.
మరోవైపు ప్రాజెక్టుల పరిస్థితీ ఆశాజనకంగా లేదు. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రధాన రిజర్వాయర్లన్నీ ఇన్‌ఫ్లో లేక డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. మధ్యతరహా, మైనర్ ప్రాజెక్టులదీ అదే స్థితి. చెరువులు, చెక్‌డ్యామ్‌లలో 25శాతమైనా నీటి నిల్వల్లేవు. దిక్కుతోచని రైతులు రోడ్డెక్కుతున్నారు. సాగునీటి కోసం ఆందోళనలు సాగుతున్నాయి. పల్లెల్లో తాగునీటి తండ్లాట కూడా మొదలైంది. ఈ దశలో ప్రభుత్వం ఏం చేయాలి? ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టాలి. కానీ, కాంగ్రెస్ సర్కార్.. పూర్తిగా వేయని రైతుబంధుకు ఊరికో సభ పెడుతూ అసలు సమస్య నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నది.
కరువు కమ్ముతున్న ఈ దశలో కాళేశ్వరమే ప్రత్యామ్నాయంగా కనబడుతున్నది. ఎగువన ఎస్సారెస్పీలో 1620 క్యూసెక్కుల వరద మాత్రమే ఉంటే.. మేడిగడ్డ వద్ద 63 వేల క్యూసెక్కులకు వరద వచ్చిచేరుతున్నది. కరువులో కాళేశ్వరమే కల్పతరువు అన్నది మరోసారి సత్యమని నిరూపితమవుతున్నది. ఆ నీటిని ఎత్తిపోసి, చెరువులను నింపాల్సిన ప్రభుత్వం.. వస్తున్న వరదను వచ్చినట్టు కిందికి వదిలేస్తున్నది. వర్షాభావ పరిస్థితుల్లో చుక్కనీటినీ జాగ్రత్తగా వాడుకోవాల్సిన దశలో వరద నీటిని సముద్రంపాలు చేస్తున్నది. రైతును నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేస్తున్నది.
హైదరాబాద్, జూలై4 (నమస్తే తెలంగాణ): నైరుతి సమీపించి నెల గడచిపోతున్నది. ఇప్పటికీ ఒక్క భారీ వర్షం నమోదు కాలేదు. జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే నమోదైంది. జూలైలోనూ సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లు అడుగంటిపోయాయి.
పెద్ద ప్రాజెక్టులే కాకుండా కృష్ణా, గోదావరి బేసిన్‌లోని మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులదీ అదే పరిస్థితి. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో చెరువులు, చెక్‌డ్యాముల్లోనూ ప్రస్తుతం 25శాతం మేర కూడా నీటి నిల్వలు అందుబాటులో లేవని అధికారులే వెల్లడిస్తున్నారు. మరోవైపు గోదావరిలో ఎగువ నుంచి వరద ప్రవాహాలు నమోదు కావడమే లేదు. ఇన్‌ఫ్లోలు వస్తున్న దాఖలాలే లేవు. ఎస్సారెస్పీకి 1,000 క్యూసెక్కులకు మించి నీరు రాలేదు.
సీజన్ ఆరంభం కాగానే సాధారణంగా కడెం ప్రాజెక్టులో వరద ప్రవాహాలు మొదలవుతాయి. కానీ ఈ ఏడాది అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ప్రాజెక్టుకు ఇప్పటికీ 100 క్యుసెక్కుల ప్రవాహం మించలేదు. దానిపై ఆధారపడిన ఎల్లంపల్లిదీ అదే పరిస్థితి. మొత్తంగా అప్పర్, మధ్య గోదావరిలో ప్రవాహాలు లేకుండా పోయాయి. కృష్ణా బేసిన్లో పరిస్థితి మరింత దారుణంగానే ఉన్నది.
ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర మొదలు, దిగువన రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఇప్పటికీ ఒక్క చుక్క వచ్చి చేరలేదు. సాధారణంగా కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయి నీటినిల్వ మట్టానికి చేరుకొన్న అనంతరం ఆగస్టులో ప్రవాహాలు మొదలవుతుంటాయి. కానీ ప్రస్తుతం ఎగువన ఆయా రాష్ర్టాల్లోని ప్రాజెక్టులు సైతం వెలవెలబోతున్నాయి. దీంతో ఆగస్టు నాటికి కృష్ణాలో జలాలు వచ్చే సూచనలే కనిపించడం లేదు.
మున్ముందు పరిస్థితి ఇలాగే కొనసాగితే తాగునీటి సరఫరాకూ తీవ్ర ఇబ్బందులు తలెత్తడం ఖాయమని తెలుస్తున్నది. ఆయా ప్రాజెక్టులపై తాగునీటికి ఆధారపడిన పట్టణాలు, పల్లెలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అధికారులే హెచ్చరిస్తున్నారు. ఇంకోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉన్నదని, సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీబరాజ్) వద్ద అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. జూన్ రెండోవారం నుంచే బరాజ్ వద్ద ప్రాణహిత నుంచి వరద ప్రవాహం మొదలైంది. ఒక్క పెద్ద వాన పడలేదు. అయినా జూన్20 నాటికే సగటున బరాజ్ వద్ద 3,300 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగింది. జూలై మొదటి నాటికి 12 వేల క్యూసెక్కులకు చేరుకొన్నది.
గడచిన రెండురోజుల్లో 18 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదు కాగా, శనివారం ఉదయానికి 45,700 క్యూసెక్కులకు, సాయంత్రానికి 90 మీటర్ల వద్ద 62,700 క్యూసెక్కులకు చేరుకొన్నది. అంటే 6టీఎంసీల జలాలు తరలిపోతున్నాయి. మొత్తంగా అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతూనే ఉన్నది. అక్కడి నుంచి 2టీఎంసీల జలాలను ఎత్తిపోసుకొనే సామర్థ్యం ఉన్నది. అంతేకాదు ప్రస్తుతం పిల్లర్ కుంగుబాటుకు గురైన లక్ష్మీబరాజ్ వద్ద నుంచి నీటిని మళ్లించేందుకు అన్నివిధాలుగా అవకాశాలు ఉన్నాయని ఇంజినీరింగ్ అధికారులే చెప్తున్నారు.
మేడిగడ్డ వద్ద క్రస్ట్‌లెవల్ 89 మీటర్లు కాగా, అదే సమయంలో 92 మీటర్ల నుంచే నీటిని పంపింగ్ చేసే వెసులుబాటు ఉన్నది. బరాజ్‌లో నీటిని నిల్వ చేయకుండా, దాదాపు 3నుంచి 4 మీటర్ల ఎత్తును మెయింటెయిన్ చేయగలిగితే నీటిని ఎత్తిపోసుకోవచ్చని, అందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులే ధీమా వ్యక్తంచేస్తున్నారు. అదీగాక ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లోనూ ఇప్పటికే గ్రౌటింగ్‌ను పూర్తిచేయడంతోపాటు, లీకేజీలను గతంలోనే అరికట్టారు. తద్వారా నీటి పంపింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుత నీటిఎద్దడిని, ఈ సీజన్‌కు సాగునీటిని కూడా అందించవచ్చని, ఎల్ నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉన్నదని ఇరిగేషన్ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరం నుంచి జలాలు వృథాగా దిగువకు పోతున్నా కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నది. ప్రాజెక్టుపై ఇంకా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నది. నీటిని పంపింగ్ చేసి నిల్వ చేసుకొనే అవకాశం ఉన్నా బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు ఎక్కడ పేరొస్తుందోననే సాకుతో ప్రాజెక్టును ఇంకా పడావుగానే ఉంచుతున్నది. అదీగాక బరాజ్‌ల్లో నీటిని నిల్వ చేస్తే కూలిపోతాయంటూ దుష్ప్రచారం చేస్తున్నది. మరోవైపు అసెంబ్లీ వేదికగా అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు ఎలాంటి ఢోకా లేదంటూ చెప్పుకొస్తున్నది. దీన్నిబట్టి కేవలం రాజకీయాల కోసమే నీటిని పంపింగ్ చేయడం లేదని తేటతెల్లమవుతున్నది. కానీ మున్ముందు ఇదే వర్షాభావ పరిస్థితులు నెలకొంటే రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అదీగాక సాగునీటి సంగతి పక్కనబెడితే కనీసం తాగునీటికి సైతం కటకటలాడాల్సిన దుస్థితి రావచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
