హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లు అడుగంటుతున్నాయి. పెద్ద ప్రాజెక్టులే కాకుండా బేసిన్‌లోని మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులదీ అదే స్థితి. దీంతో కృష్ణా బేసిన్లో నీటి నిల్వలు అడుగంటి, భూగర్భజలాలు కూడా పాతాళానికి పడిపోతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, డిసెంబర్ నాటికి 210.81 టీఎంసీలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం 40 టీఎంసీలు ఉన్నాయి. రిజర్వాయర్ ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు మరో రెండు జిల్లాల తాగునీటి అవసరాలను రిజర్వాయర్ నుంచే తీర్చాల్సి ఉన్నది.
ప్రస్తుతం డెడ్‌స్టోరేజీ వరకు అందుబాటులో ఉన్నదే 10 టీఎంసీలు. నాగార్జునసాగర్‌లో నీటినిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ రిజర్వాయర్ నుంచి హైదరాబాద్, నాగార్జునసాగర్, హుజూర్నగర్, మిర్యాలగూడ, కోదాడ, నల్లగొండ, వైరా, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉన్నది. జూన్‌లో వానలు ప్రారంభమయ్యే వరకూ తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉన్నది. గోదావరి బేసిన్లో కొద్దిమేర ఆశించిన స్థాయిలో జలాలు ఉన్నాయి. కానీ, తాగునీటి అవసరాలున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. రామప్ప, లక్నవరం, పాకాల, మత్తడివాగు, నీల్వాయి, కిన్నెరసాని, పాలేరు, పాలెం, కోటిపల్లి, వైరా, లంకాసాగర్, మూసి, శనిగరం, రామడుగు, మల్లూరు, గుండ్లవాగు, బయ్యారం, స్వర్ణ తదితర అనేక ప్రధాన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు డెడ్‌స్టోరేజీకి చేరుకొన్నాయి. ఇక మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో చెరువులు, చెక్‌డ్యామ్‌ల్లోనూ ప్రస్తుతం 25% మేర కూడా నీటి నిల్వలు అందుబాటులో లేవని అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్టులు అడుగంటి పోవడంతో భూగర్భజల మట్టాలు తగ్గిపోతున్నాయి.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని, దీని ప్రభావంతో సాధారణంగా వర్షపాతం తగ్గి, ఎండలు ఎకువగా ఉంటాయి. నీటికొరత, పంటల దిగుబడి తగ్గడం, భూగర్భజలాల స్థాయి పడిపోవడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. కొన్నిప్రాంతాల్లో కరువు పరిస్థితులు కనిపిస్తాయి. ఈ సీజన్లో జూన్-సెప్టెంబర్, ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం బలహీనంగా ఉండే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. నీటిని పొదుపుగా వాడటంతోపాటు అందుకు అనుగుణంగా పంటల కాలాన్ని ప్రణాళిక చేసుకోవాలని సూచించింది. అయితే, ఇరిగేషన్ శాఖ, ప్రభుత్వం ప్రస్తుతం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ప్రణాళికలను రూపొందించే అంశాన్ని కనీసం పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని అధికారులు చెప్తున్నారు.
