వరంగల్ : తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే ఎస్టీలకు రిజర్వేషన్లు లభించాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని కొడకండ్ల మండలం పెద్దబాయి తండా గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. సంత్ సేవాలాల్ వల్ల ఎస్టీలకు గుర్తింపు, గౌరవం లభించాయని అన్నారు.
మున్నెన్నడు జరగని విధంగా ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ఉచిత కరెంట్‌ను గిట్టని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుందని అన్నారు. మీటర్ల వల్ల వ్యవసాయం కుదేలవుతుందని, రైతులు ఆర్థికంగా రోడ్డున పడుతారని పేర్కొన్నారు. అనుక్షణం రైతుల మేలు కోసం ఆలోచించే సీఎం కేసీఆర్ కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించారని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని వారికి సకాలంలో ధాన్యం డబ్బులు బ్యాంకుల్లో జమా చేస్తున్నామని అన్నారు. పాలకుర్తిలో ఎకరం స్థలాన్ని కేటాయించి రూ. రెండు కోట్లతో సేవాలాల్ భవనాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.