హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేటకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం పంచాయతీరాజ్‌శాఖ ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వేర్వేరు జీవోలు (జీవోనంబర్-9, 41, 42) మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఖరారు చేశారు. రాష్ట్రంలో మొత్తం 31 జిల్లా పరిషత్‌లు ఉండగా, బీసీలకు 13, ఎస్సీలకు ఆరు, ఎస్టీలకు నాలుగు, జనరల్ (అన్‌రిజర్వుడ్) స్థానాలు ఎనిమిదిగా నిర్ధారించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 రిజర్వేషన్ ప్రకారం.. 31 జడ్పీల్లో 15 స్థానాలను మహిళలకు కేటాయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ డైరెక్టర్ శనివారం గెజిట్ కూడా విడుదల చేశారు. జడ్పీల రిజర్వేషన్ల గెజిట్ కాపీ అందగా, జిల్లావారీగా జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యుల రిజర్వేషన్ల గెజిట్ కాపీలు అందాల్సి ఉన్నది. ఇవన్నీ రాష్ట ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ)కు చేరగానే, నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది.
తొలుత ఎంపీటీసీ ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికలను మొత్తం మూడు దశల్లో బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. తొలుత ఎంపీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఎన్నికలకు సంబంధించిన అన్ని నివేదికలు అందిన వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అవసరమైన ప్రక్రియలను పూర్తిచేసే పనుల్లో ప్రస్తుతం ఎస్ఈసీ తలమునలై ఉన్నట్టు సమాచారం. ఇక కోర్టుల్లో కేసులను సైతం ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం.
ఉన్నతాధికారులతో ఎస్ఈసీ కీలక సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికలపై శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం (టీజీఎస్‌ఈసీ) కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదినీ నిర్వహించిన సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు, అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్యదర్శులు ఎన్ శ్రీధర్, సందీప్‌కుమార్ సుల్తానియా, ఎక్సైజ్‌శాఖ కమిషనర్ హరికిరణ్ తదితరలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై పంచాయతీరాజ్,పోలీస్, ఎక్సైజ్ శాఖల నివేదికలను ఎలక్షన్ కమిషన్ తీసుకున్నది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీలోపు స్థానిన సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నది. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో హైకోర్టు విధించిన డెడ్‌లైన్‌లోగా ఎన్నికలు పూర్తిచేసే పరిస్థితి లేదు. కావున ఆ లోపు కనీసం నోటిఫికేషన్ ప్రకటించి, ఎన్నికల ప్రక్రియను ప్రారంభించామని, వచ్చే నెలాఖరులోపు పూర్తిచేస్తామని, ఆ మేరకు అనుమతి ఇవ్వాలని హైకోర్టుకు విన్నవించేలా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం చెప్పాలని చూస్తున్నట్టు తెలిసింది.
క్రమసంఖ్య జిల్లా పరిషత్‌ల పేర్లు రిజర్వేషన్ కేటాయింపు
1) ఖమ్మం – ఎస్టీ-జనరల్
2) ములుగు – ఎస్టీ- మహిళ
3) నల్లగొండ – ఎస్టీ-మహిళ
4) వరంగల్ – ఎస్టీ- జనరల్
5) హనుమకొండ – ఎస్సీ-మహిళ
6) జనగామ ఎస్సీ-మహిళ
7) జోగులాంబ గద్వాల – ఎస్సీ-జనరల్
8) రాజన్న సిరిసిల్ల – ఎస్సీ-జనరల్
9) రంగారెడ్డి – ఎస్సీ-మహిళ
10) సంగారెడి – ఎస్సీ-జనరల్
11) జయశంకర్ – బీసీ- జనరల్
భూపాలపల్లి
12) కరీంనగర్ – బీసీ-జనరల్
13) కుమ్రంభీ ఆసిఫాబాద్ – బీసీ-జనరల్
14) మహబూబ్‌నగర్ – బీసీ- మహిళ
15) మంచిర్యాల – బీసీ-మహిళ
16) నాగర్‌కర్నూల్ బీసీ-మహిళ
17) నిర్మల్ – బీసీ- జనరల్
18) నిజామాబాద్ – బీసీ-మహిళ
19) సిద్దిపేట – బీసీ-జనరల్
20) సూర్యాపేట – బీసీ-జనరల్
21 వికారాబాద్ – బీసీ- జనరల్
22) వనపర్తి – బీసీ-మహిళ
23) యాదాద్రి భువనగిరి – బీసీ-మహిళ
24) ఆదిలాబాద్ – జనరల్-మహిళ
25) భద్రాద్రి కొత్తగూడెం – జనరల్
26) జగిత్యాల – జనరల్-మహిళ
27) కామారెడ్డి – జనరల్
28) మహబూబాబాద్ – జనరల్
29) మెదక్ – జనరల్
30) నారాయణపేట – జనరల్-మహిళ
31) పెద్దపలి – జనరల్-మహిళ