అచ్చంపేట : శ్రీశైలం ఎడమ గట్టు ఎస్ఎల్బీసీ ( SLBC ) సొరంగంలో చిక్కుకున్న మిగిలిన ఆరుగురి మృతదేహాల ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు ( Rescue teams ) శ్రమిస్తున్నాయి. టన్నెల్లో ప్రమాదం జరిగి 49 వ రోజుకు చేరినా మృతదేహాలకు సంబంధించి నేటికీ ఎటువంటి ఆచూకీ దొరకలేదు. టన్నెల్లో 13.730 కిలో మీటర్ల నుంచి 13.800 కిలోమీటర్ వరకు రెస్క్యూ సిబ్బంది నాలుగు రోజులపాటు శ్రమించి కన్వేయర్ బెల్ట్ (Conveyor Belt ) ను పునరుద్ధరించారు.
పొడిగించిన కన్వేయర్ బెల్టు ద్వారా 70 మీటర్లు ప్రాంతంలో శిథిలాలు, మట్టి, బురదను తొలగించేందుకు సహాయక చర్యలు వేగవంతం చేశారు. మిగిలిన 70 మీటర్ల వరకు సహాయక చర్యలలో భాగంగా శిథిలాలు పూర్తిగా తొలగించి అక్కడి నుంచి అత్యంత ప్రమాదకరంగా మారిన 45 మీటర్లు తొలగించడానికి అవకాశం లేకుండా పోయింది. అక్కడి వరకు రెస్క్యూ సిబ్బంది కంచే ఏర్పాటు చేశారు.
రెస్క్యూ చర్యలను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి ( Shiva Shanker ) శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రమాద ప్రాంతంలోని లోతైన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించే పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సహాయక చర్యల్లో భాగంగా, టన్నెల్లో నీటిని బయటకు పంపించే ప్రక్రియ, టీబీఎం భాగాలను కత్తిరించే పనులు, స్టీల్‌ను తొలగించడంలాంటి అంశాలు కూడా నిరంతరాయంగా జరుగుతున్నాయని వివరించారు. టన్నెల్ నిపుణులు, ప్రభుత్వ విపత్తు నిర్వహణ విభాగం, రెస్క్యూ బృందాలు ఆధునిక సాంకేతిక పద్ధతులతో సమన్వయంగా పనిచేస్తున్నాయని అన్నారు.