సంగారెడ్డి, జూలై 5 (నమస్తే తెలంగాణ)/పటాన్చెరు/పటాన్చెరు రూరల్ : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ వద్ద శనివారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. మృతుల అవయవాలు కనుక్కునేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలం లో తవ్వకాలు జరిపాయి. ఈ క్రమంలో సహాయక బృందాలకు అవయవభాగాలు లభించాయి. వీటిని డీఎన్ఏ పరీక్షల కోసం పంపించారు. ప్రమాదంలో జాడ దొరకని తొమ్మిది మందికోసం బాధిత కుటుంబాలు వేచి చూస్తున్నాయి. సహాయక చర్యలు ముగింపు దశకు వచ్చినా తొమ్మిది మంది జాడ లభించకపోవడంతో సందిగ్ధత నెలకొన్నది.
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 40 మంది కార్మికులు మృతిచెందారు. పటాన్చెరు ప్రభు త్వ దవాఖానలో ఉన్న మృతదేహాల్లో ముగ్గు రి మృతదేహాలను డీఎన్ఏ ఫలితాల ద్వారా గుర్తించారు. ఒడిశాకు చెందిన పూర్ణచందర్, బీహార్‌కు చెందిన అస్లం అన్సారీ, శంభురామ్గా తేల్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పటాన్చెరు మార్చురీలో ఉన్న రెండు మృతదేహాలను గుర్తించాల్సి ఉన్నది. పటాన్‌చెరులోని ధ్రువ దవాఖానలో చికిత్స పొందుతున్న కార్మికుల్లో ఒకరు మృతి చెందారు. ఆరు రోజులుగా చికిత్స పొందుతున్న మున్ము న్ చౌదరి ఆరోగ్యం విషమించి శనివారం మృతి చెందాడు. సిగాచి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటుచేసుకుని బీహార్ రాష్ట్రంలోని కరక్కడ ఎంపీ రాజారామ్‌సింగ్ ఆరోపించారు. శనివారం సిగాచి పరిశ్రమను ఆయన సందర్శించారు.