అచ్చంపేట, ఏప్రిల్ 20 : నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న మిగిలిన ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ఆరుగురి కోసం 58 రోజులుగా రెస్క్యూ సిబ్బంది అన్వేషణ చేస్తున్నా వారి ఆనవాళ్లు లభించడం లేదు. టన్నెల్లో డేంజర్ జోన్ అయిన డీ-1, డీ-2 ప్రదేశం వరకు సహాయక పనులు కొనసాగుతున్నాయి. అక్కడ టీబీఎంకు సంబంధించిన స్టీల్, ఇసుప పరికరాలు కటింగ్ చేస్తున్నారు. బండరాళ్లు, స్టీల్ పరికరాలు కట్ చేసి, లోకోట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. డేంజర్ జోన్లో ఓవైపు జాగ్రత్తలు తీసుకుంటూ మరోవైపు స్టీల్ కటింగ్ పనులు చేపడుతున్నారు. పైనుంచి సిమెంట్ సెగ్మెంట్లు కూలిపడిపోకుండా సపోర్టు పెట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీగా వస్తున్న నీటిఊటను అధిక సామర్థ్యం గల మోటర్లతో బయటకు పంపుతున్నారు. డేంజర్జోన్గా పేర్కొన్న చివరి ప్రదేశానికి వెళ్లడం అతికష్టంగా మారింది. ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి అక్కడే ఉండి, సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.