నాగర్ కర్నూల్, మార్చి 28: నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. సొరంగం లోపల జరుగుతున్న సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు నిరంతరాయంగా పనిచేస్తున్న సహాయక బృందాల సహాయక చర్యలపై అభినందిస్తూ, రెట్టింపు వేగంతో సహాయక చర్యలను కొనసాగించాలని అధికారులకు సూచించారు. జీఎస్ఐ అధికారుల సూచనలకు అనుగుణంగా ప్రమాద ప్రదేశం నుంచి 30 మీటర్ల వరకు బారీ కేడింగ్ చేసినట్లు, జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు టెలిటెల్, బాక్స్ క్రీప్ స్ట్రక్చర్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షణ జరుపుతున్నట్లు వివరించారు.
టన్నెల్ లోపల సహాయక చర్యలలో భాగంగా సొరంగంలో మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు, తవ్వకాలకు అడ్డంకిగా ఉన్న స్టీల్‌ను తొలగిస్తూ, ఎప్పటికప్పుడు ఊట నీటిని పంపుల ద్వారా బయటకు తరలిస్తున్నట్లు వివరించారు. ప్రమాద ప్రదేశం సమీపంలో మట్టి కింద ఉన్న లోకో ట్రైన్ క్యాబిన్లను తొలగించి లోకో ఇంజిన్‌ను బయటకు తీసేందుకు, సహాయక బృందాలు పూర్తిస్థాయిలో చర్యలు వేగవంతం చేస్తున్నాయన్నారు. ప్రమాద ప్రదేశం సమీపంలో ఉన్న పెద్దపెద్ద బండరాళ్లను ఎస్కవేటర్ ద్వారా తొలగిస్తూ, టీబీఎం భాగాలను అల్ట్రా థర్మల్ కట్టర్‌తో కట్ చేస్తూ వాటి భాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. తవ్వకాల ద్వారా తీస్తున్న మట్టిని కన్వేయర్ బెల్ట్ గుండా బయటకు తరలిస్తున్నట్లు, ప్రమాద ప్రదేశ సమీపం వరకు కన్వేయర్ బెల్ట్‌ను పొడిగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివాసులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారి కిరణ్ కుమార్, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే అధికారి నేతి చంద్ర, జీఎస్ఐ అధికారి పంకజ్ తిరుగున్, హైడ్రా అధికారి యజ్ఞ నారాయణ, జేపీ కంపెనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.