హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా ప్రకటనలు జారీచేస్తూ మారెటింగ్ కార్యకలాపాలు నిర్వహించే స్థిరాస్తి వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని రెరా కార్యదర్శి పీ యాదిరెడ్డి హెచ్చరించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, ఇతర స్థానిక సంస్థల నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాత రియల్టర్లు తమ ప్రాజెక్టులను విధిగా రెరాలో రిజిస్టర్ చేసుకోవాలని, ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ను తప్పనిసరిగా వ్యాపార ప్రకటనల్లో పేర్కొనాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రెరా నిబంధనలను అతిక్రమించిన పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆయన షోకాజ్ నోటీసులు జారీచేసి, 15 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండాలోని జీఆర్ఆర్ విశ్రాంతి రిసార్ట్స్, కూసుమంచి మండలం జీలచెరువు గ్రామంలోని జీఆర్ఆర్ హైవే కౌంటీ ప్రాజెక్టు, మునిగేపల్లి గ్రామంలోని ఇండో క్వటార్ ప్రాజెక్టు, అబ్దుల్లాపూర్ మండలం తట్టి అన్నారంలోని అనంత వనస్థలి హిల్స్ ప్రాజెక్టు యజమానులతోపాటు హైదరాబాద్‌లో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు అక్రమంగా వ్యాపార ప్రకటనలు ఇస్తున్న గో గ్రీన్ గ్రూపునకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. వీటితోపాటు హఫీజ్‌పేటలో ప్రీలాంచ్ కార్యక్రమాలు చేపట్టి ఇప్పటికే నోటీసులు అందుకున్న బిల్డాక్సు రియల్ ఎస్టేట్ కంపెనీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి సంజాయిషీ కోరుతూ ఆ సంస్థకు నోటీసులు జారీచేశారు. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా రియల్టర్లు ప్రకటనలు జారీచేయడం, మారెటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం చట్టవిరుద్ధమని, అలాంటివారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని యాదిరెడ్డి హెచ్చరించారు.