హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేతిలో అన్యాయానికి గురైన బాధితురాలికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
బండి భగీరథ్ చేతిలో మోసపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితురాలిని ప్రత్యక్షంగా కలిసి వాస్తవాలు తెలుసుకుంటామని ఎమ్మెల్యే పద్మావతి, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నేరెళ్ల శారద, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. బుధవారం వారు గాంధీభవన్లో మాట్లాడుతూ.. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడటానికి, బాధ్యులపై చట్టపరంగా కఠినపరమైన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, విచారం వ్యక్తం చేస్తున్నామని పద్మావతి, నేరెళ్ల శారద, ఎర్రబెల్లి స్వర్ణ పేర్కొన్నారు.